Jul 24,2023 19:14

తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : అంగంన్వాడి టీచర్లకు బిఎల్‌ఒ డ్యూటీలను రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. మహేష్‌ మాట్లాడుతూ గతంలో బిఎల్‌ఒ డ్యూటీలు వల్ల ఎదురైన ఇబ్బందులను ఉన్నత అధికారులకు మొరపెట్టుకోగా వారు అంగన్వాడీ టీచర్లకు ఈ డ్యూటీలను రద్దు చేశారని చెప్పారు. నేడు మళ్లీ డ్యూటీలు వేయటం వల్ల ఫ్రీ స్కూల్స్‌ నడపడం, ఆన్‌లైన్‌ రికార్డులు పంపడం, గర్భిణులకు, బాలింతలకు, సకాలంలో పోషకాహారం అందించడంలో ఆటంకాలు ఏర్పడతాయని చెప్పారు. గ్రామాల్లో రాజకీయ వేధింపులకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలను బిఎల్‌ఒ డ్యూటీని మినహాయించాలని, లేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, ఉమాదేవి, సుశీల, దుర్గ భవాని, పద్మ, ప్రభావతి పాల్గొన్నారు.