Nov 21,2023 00:21

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే.... డిసెంబర్‌ 8న సమ్మెకు సిద్ధం

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే....
డిసెంబర్‌ 8న సమ్మెకు సిద్ధం

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సోమవారం సిఐటియు, ఐఎప్‌టియూ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు నిరసన తెలిపారు. నాయకులు గంధం మణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామంటూ శాసనమండలిలో ఆశాఖా మంత్రి హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోతున్న కార్యరూపం దాల్చలేదన్నారు. తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీని అమలు చేయలేదని మండిపడ్డారు. మినీ సెంటర్లన్నింటిని మెయిన్‌ సెంటర్లుగా మార్చాలనీ, అంతవరకు మెయిన్‌ టీచర్లకు సమానంగా వేతనం ఇవ్వాలని సూచించారు. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.5లక్షలకు పెంచాలనీ, ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే డిసెంబర్‌ 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఐసిడిఎస్‌ అధికారికి సమ్మె నోటీసును అందజేశారు. రేవతి, పుష్ప, మునిలక్ష్మీ, రాధ, శారద తదితరులు పాల్గొన్నారు.
పుత్తూరు టౌన్‌: అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని సోమవారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పేస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అధ్యక్షకార్యదర్శులు విజయ కుమారి, ముని కుమారి, మోహన్‌లక్ష్మీ, అన్నపూర్ణ, అంబిక, ధనమ్మ, జయంతి, రాధ, పద్మజ పాల్గొన్నారు.
రేణిగుంట: అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ యూనియన్‌ రేణిగుంట ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8వ తేదీ సమ్మెకు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సిడిపిఓకు సమ్మె నోటీసును అందజేశారు. పాండురంగమ్మ, భాగ్య, ప్రభావతి, అంబికా, విజయ, రాధా, భారతి పాల్గొన్నారు.
గూడూరు టౌన్‌: పట్టణంలోని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో గూడూరు రూరల్‌ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సిడిపిఓకు సమ్మె నోటీసును అందించారు. సిఐటియు పట్టణాధ్యక్షులు బివి.రమణయ్య, కార్యదర్శి ఎస్‌.సురేష్‌, బి. చంద్రయ్య, అంగన్వాడీలు కె. హెబ్సిబి, వాణి, భాగ్యశ్రీ, ఇంద్రావతి, ప్రభావతి పాల్గొన్నారు.
నాయుడుపేట: అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోర్కెలు తీర్చాలని నాయుడుపేట ఐసిడిసి కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8న నిరవధిక సమ్మెకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలియజేశారు.