రాజంపేట అర్బన్ : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, చిట్వేల్ రవికుమార్‌లు డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, రవికుమార్ మాట్లాడుతూ కూరగాయల బిల్లులకు కమిషన్ ఇవ్వాలని ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది అంగన్వాడీలపై ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పూనుకోకుండా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రేషన్ కార్డు రద్దుచేసి సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేయాలని కోరారు. కొత్తగా నియమితులైన హెల్పర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే వారికి జీతాలు మంజూరు చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, కూరగాయల బిల్లులు, సిబి బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్‌ఛార్జి సిడిపిఒ సరళదేవికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఎ.శ్రీలక్ష్మి, ఎం.ఈశ్వరమ్మ, కార్యకర్తలు ఎం.విజయమ్మ, పి.వి.శివరంజని, అన్నపూర్ణమ్మ, ఉమ, శిరీష, ఇంద్రావతి, మమత, నాగమణి, రాజేశ్వరి పాల్గొన్నారు.ఇన్‌ఛార్జి సిడిపిఒకు వినతి పత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు










