ప్రజాశక్తి - సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ సిడిపిఒ బి.సత్యవతికి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షులు బి.రాధ ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో కంటే ఎక్కువ వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ రద్దు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్యామల, హెల్పర్స్ యూనియన్ నాయకులు జ్యోతి, అరుణ పాల్గొన్నారు.










