రాయచోటి టౌన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం రాయచోటిలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షులు ఎస్.శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ 48 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు గ్రామీణ, పట్టణ మురికివాడలలో నివసించు పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన గర్భిణులు, బాలింతలు, 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు సేవలు, ప్రభుత్వ నిర్దేశిత ఉద్దేశాలు నెరవేర్చే దిశలో అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడంలేదని, నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఆర్టీసీ, రైల్వే ధరలు పెరుగుతూ వేతనాలు మాత్రం పెరగక అంగన్వాడీలకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందని వాపోయారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సంబంధిత మంత్రులు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ కంటే వేయిలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ హామీ నెరవేరలేదని, పైగా వివిధ రకాల యాప్స్ పేరుతో ఇబ్బందులు పెడుతూ, మానసిక వత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు మూడు సంస్థల అనుబంధ అంగన్వాడీ సంఘాలు ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయని తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్‌కు కనీస వేతనాలు చెల్లించాలి, తెలంగాణ కన్న అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీని అమలు చేయాలని, మినీ సెంటర్లన్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్, వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని, రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని, వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు ఖచ్చితమైన కొలతలతో ప్రతినెల 5వ తేదీలోపుగా సకాలంలో సెంటర్లకు అందించాలని తదితర సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం ఐక్య కార్యాచరణలో మూడు సంఘాలు 25న ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ నాయకులు మధురవాణి, ఓబులమ్మ, శ్రీరమాదేవి, గౌరి, శ్రీవాణి, రాధాకుమారి పాల్గొన్నారు.
రైల్వేకోడూరు : విజయవాడలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే ధర్నాను జయప్రదం చేసేందుకు అంగన్వాడీలు తరలి రావాలని యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు ఎన్.రమాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం సూపర్‌వైజర్‌కు వినతిపత్రం అందేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఎస్.శ్రీలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.రాధ పాల్గొన్నారు.










