* మంత్రి ధర్మానకు 'అంగన్వాడీ' నాయకుల వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ కోరారు. పెద్దపాడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ కన్నా అదనంగా రూ.వెయ్యి వేతనాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు టి.హెచ్.ఆర్ అమలుకు కొత్తగా తీసుకొచ్చిన యాప్ వల్ల అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ అమలు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని, పర్యవేక్షణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి టిఎ బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, వారికి తోడు గ్రామ సచివాలయాల పర్యవేక్షణ, ఫుడ్ కమిషనర్, ఎంఎస్‌కె. తహశీల్దార్, ఎంపిడిఒ, రాజకీయ నాయకులు ఇలా అనేకమంది విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలని, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు అందజేయాలని, వేతనంలో సగం పెన్షన్ ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జె.కాంచన, నాయకులు కె.ప్రమీలాదేవి, పి.రాజేశ్వరి, కె.సంధ్య, శ్యామల తదితరులు పాల్గొన్నారు.










