Jun 15,2023 21:17

ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, అంగన్వాడీలు

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
- సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
- జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.నాగరాజు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నిర్మలమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం నంద్యాలలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ముందు సిఐటియు, యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు డి.నిర్మలమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయమని గత నాలుగు సంవత్సరాల ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. ఐసిడిఎస్‌ పరిరక్షణ కోసం, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, సుప్రీం కోర్టు. తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చెయ్యాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదని తెలిపారు. 2022 ఏప్రిల్‌ 25న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చెయ్యమని చెప్పినా ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని చెప్పారు. అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామి అమలు చెయ్యలేదన్నారు. సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి అంగన్వాడీలు నెట్టబడ్డారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో ఫుడ్‌ కమిషనర్‌, ఎంఎస్‌కె ఎంఆర్‌ఒ, ఎండిఒ, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది అంగన్వాడీలను అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 10, 11 కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరవధిక ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయడం ద్వారా ఈ డిమాండ్స్‌ను సాధించుకోవడానికి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాణి, సునీత, ప్రాజెక్టు నాయకురాలు రమణమ్మ, సావిత్రి, రాధాకృష్ణ, వేణి, కొండమ్మ, రేణుక, సరస్వతి, సారమ్మ, వినీత తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు రాజ్యలక్ష్మి, శైలజ, గౌసియాలు మాట్లాడారు. అనంతరం సిడిపిఒకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు ఆళ్లగడ్డ కార్యదర్శి రమేష్‌ బాబు, నంద్యాల అధ్యక్షుడు బాల వెంకట్‌, అంగన్వాడీ టీచర్లు గుల్జార్‌, ముంతాజ్‌, విజయమ్మ, వేణమ్మ, ఆయాలు పాల్గొన్నారు. బనగానపల్లె : అంగన్వాడీ వర్కర్లకు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు రోజా రమణి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయంలో సిడిపిఓ ఉమా మహేశ్వరమ్మకు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్లు మల్లేశ్వరి, శశికళ, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డోన్‌ : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు షేభారాణి, మండల, పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు, నక్కీశ్రీకాంత్‌, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగం, గౌసియా, మాదేవి అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు గుల్జార్‌ బి,మేరీ, రాజేశ్వరి, వరలక్ష్మి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శివరాంలు డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం దగ్గర మండల కార్యదర్శి నాగలక్ష్మి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వరయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, హరితలు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేసి అధికారికి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వాములు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు ప్రమీలమ్మ, లక్ష్మీదేవి, రాజమ్మ, మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.