Jan 11,2023 23:44

ధర్నా అనంతరం వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి - పరవాడ
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పరవాడ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్‌.దేవి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పేస్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పర్యవేక్షణ పేరుతో వేధింపుల ఆపాలని, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు, వేతనంలో సగభాగం పెన్షన్‌ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సూపర్వైజర్‌ పోస్టుల్లో వయోపరిమితి తొలగించాలని, హెల్పర్‌ ప్రమోషన్లను వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయం అరికట్టాలని కోరారు. వర్కర్లతో సమానంగా మినీ టీచర్‌కు వేతనాలు చెల్లించాలని, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా తీసుకోవాలని, అదనంగా వేతనం ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 1ను రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కుమారి, నీలిమ, శాంతి, వెంకటి లక్ష్మి, స్వాతి, అరుణ, రామలక్ష్మి, ముత్యాల రాణి తదితరులు పాల్గొన్నారు.