ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తున్న యూనియన్ నాయకులు గురువారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కార్యాలయంలో ఆమె వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం అందచేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలందరికీ వర్తింపచేసే విధంగా నిబంధనలు సడలించాలని, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ రెండేళ్లుగా రిటైర్ అయిన అందరికీ చెల్లించాలని, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫర్నీచర్, వంటపాత్రలు, గ్యాస్ స్టవ్ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సొంత భవనాలున్న సెంటర్లకు ప్రహరీగోడలు, మరుగుదొడ్లు నిర్మించాలని, అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యం కల్పనకు తగిన బడ్జెట్ ఇవ్వాలని విన్నవించారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం నివారించాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని, ప్రతినెలా జీతాలు, బిల్లులు, ఇంటి అద్దెలు చెల్లించాలని తదితర అంశాలపై వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, యూనియన్ ప్రత్తిపాడు కార్యదర్శి కె.పద్మ, నాయకులు యు.శ్రీదేవి, పి.శివపార్వతి పాల్గొన్నారు.










