Jun 28,2023 00:18

డుంబ్రిగుడలో వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-పాడేరు: అంగన్వాడీల బడ్జెట్‌ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ జూలై 10,11 తేదీల్లో అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చింతపల్లి మండల కమిటీ నాయకులు పెంటమ్మ అక్కమ్మ వరలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద మంగళవారం ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి, అంగన్వాడీ వర్కర్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాడ్యుటి, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జులై 10న కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.13 డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి, రమణమ్మ, రత్నం, ప్రసన్న పాల్గొన్నారు.
అరకులోయ :అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జులై 10, 11 తేదీల్లో జిల్లా కలెక్టరేట్‌ ముందు నిర్వహించే 36 గంటలు ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు జన్ని భగత్‌ రాం డిమాండ్‌ చేశారు. అంగన్వాడి టీచర్ల వద్దకు వెళ్లి కరపత్రాన్ని పంపిణీ చేస్తూ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేదని విమర్శించారు.అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో, సుశీల బుద్రి తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట: ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని సీఐటీయూ మండల కార్యదర్శి టి.అప్పల కొండ పడాల్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్వాడీల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఐసిడిఎస్‌ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఐద్వా జిల్లా నాయకులు ఎస్‌.హైమావతి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ:ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా అంగన్వాడి కార్మికులకు గ్రాడ్యుటి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఐసిడిఎస్‌ సిడిపిఓ నీలిమకు అంగన్వాడి కార్యకర్తలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్మికుల సంఘం మండల అధ్యక్షురాలు కే కొండమ్మ మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. తక్షణమే అంగన్వాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కే సత్యావతి, జి.పవిత్ర, అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.
పెదబయలు:అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోండా సన్నిబాబు డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద వర్కర్స్‌, సహాయకుల (హెల్ఫేర్స్‌ ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సన్నిబాబు మాట్లాడుతూ, జులై 10,11 తేదీల్లో 36 గంటల పాటు అల్లూరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే నిరసనలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు రాజమ్మ, వరహాలమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.