Aug 12,2023 21:35

సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలన్‌
ప్రజాశక్తి - భీమవరం

          అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే దఫాదఫాలుగా ఆందోళన చేపట్టారని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మరో పోరాటనికి సిద్ధంగా ఉన్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ హెచ్చరించారు. స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో అంగన్‌వాడీలకు శనివారం నిర్వహించిన మాస్‌ తరగతుల్లో గోపాలన్‌ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం ఆందోళన కొనసాగిస్తుందన్నారు. చట్టాల అమలులో సిఐటియు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఐక్య పోరాటంతోనే సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. ఐసిడిఎస్‌లో మాతా శిశు సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తూ, తల్లులు, రాబోయే తరం పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అంగన్‌వాడీలు శక్తికి మించి పని చేస్తున్నారన్నారు. ఫలితంగా శిశు, బాలింత మరణాలు బాగా తగ్గాయన్నారు. పౌష్టికాహార లోపం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయన్నారు. ఐసిడిఎస్‌కు నిధులు పెంచి అంగన్‌వాడీలను సంస్థగతం చేస్తే మరింత ఫలితం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, డి.కల్యాణి, ఎంబి హసీనా, మార్తమ్మ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.