Jul 11,2023 00:16

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, వేదికపై నాయకులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్‌ వద్ద సోమవారం చేపట్టిన 36 గంటల నిరసనకు అంగన్వా డీలు అధిక సంఖ్య లో హాజర వగా ధర్నా చౌక్‌తో పాటు పరిసరాలూ అంగన్వాడీలతో కిక్కిరిశాయి. తమ డిమాండ్లపై పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి సమ స్యలకు అద్దం పట్టేలా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు, కళాకారులు నాగమ్మ భారు, కె.నాగేశ్వరరావు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. నిరసనకు వివిధ సంఘాలు, నాయకులు మద్దతు ప్రకటించగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన, కలెక్టర్‌ వితిపత్రం ఇస్తామని యూనియన్‌ నాయకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభకు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి అధ్యక్షత వహించగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ మహాధర్నా నిర్విర్యానికి సాగిన కుట్రలను తిప్పికొట్టి ఇంతమంది ఇక్కడికి రావడం అంగన్వాడీల్లో చైతన్య స్ఫూర్తితోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతకు నిదర్శనమన్నారు. సిఎంకు ఇప్పటికే పలుమార్లు విన్నవించినా హామీలేగాని చర్యలు మాత్రం లేవని అన్నారు. తెలంగాణలో రూ.13,500 వేతనం ఇస్తున్నారని, సిఎం జగన్‌ హామీ ప్రకారం దానికి రూ.వెయ్యి కలిపి ఇవ్వాలని కోరారు. 2011 నుండి నిత్యాసర సరుకుల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు అనేక రెట్లు పెరిగాయని, అయినా అప్పటి వేతనాలే ఇప్పటికీ అమలవుతున్నాయని చెప్పారు. గ్రాట్యుటీ, సమాన పనికి సమాన వేతనం, సెంటర్ల అద్దెలు, మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి సీనియార్టీ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించు కుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడు తూ ఐసిడిఎస్‌కు నిధులు పెంచాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, కార్యకర్త మృతి చెందితే మట్టి ఖర్చులకు డబ్బులివ్వాలని కోరారు.
గొంతెమ్మ కోర్కెలేమీ కాదు
అంగన్వాడీలు అడుగుతున్నది గొంతెమ్మ కోర్కెలేమీ కాదని, చాలా న్యాయబద్ధమైన అంశాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు కార్యకర్తలు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారని, యాప్‌ పేరుతో వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఇంత కష్టం చేస్తున్న వారికి 2017 నుండి బిల్లులు ఎందుకు పెండిగ్‌ పెట్టారని నిలదీశారు. వేతనంతో కూడిన వారాంతపు సెలవులు, మెడికల్‌ సెలవులు ఇవ్వాలన్నారు.
కుట్రలో భాగమే బడ్జెట్‌ కుదింపు
ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు తగదని రైతు సంఘం, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శులు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ అన్నారు. నిరసనకు మద్దతుగా వారు మాట్లాడుతూ ప్రతి పార్టీ తాము అధికారంలో ఉండగా తమకు అనుకూలమైన వారిని నియమించేందుకు ఉన్నవారిపై వేధింపులకు పాల్పడడం సాధారణమైందని విమర్శించారు. అంగన్వాడీల జోలికొస్తే సహించేది లేదని, అంగన్వాడీల పోరాటాలకు పూర్తి అండగా ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చనిపోతే వారి కుటుంబంలో పదవులు కట్టబెడుతు న్నాయని, అదే అంగన్వాడీలు 40 ఏళ్లపాటు సేవలందించి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఎందుకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే బడ్జెట్‌లో నిధుల కోత పెడుతున్నారని, సమస్యలైనా చెప్పుకో వడానికి లేకుండా నిర్బంధం విధిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. అనంతరం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, జిల్లా ట్రెజరర్‌ ప్రసన్న మాట్లాడారు. ధర్నాకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, సిఐటియు నాయకులు సిలార్‌ మసూద్‌, వెంకటేశ్వరరాజు, పి.వెంకటేశ్వర్లు, శ్రీను, కె.రామారావు, కె.ఆంజనేయులు, మస్తాన్‌వలి, ఎం.ఆంజనేయులు, పద్మ, రమా, నిర్మల, షేక్‌ హజర, ఎస్‌.అహల్య, సుజాత, డి.దేవకుమారి, ఉష, కవిత, నిర్మల పాల్గొన్నారు.