ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీలు వారి సమస్యల పరిష్కారానికి ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా వినతులు, ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవటంతో 36 గంటల నిరవధిక ధర్నా చేపట్టారు. ధర్నాకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, ఆయాలు వందలాది మంది హాజరయ్యారు. వేతనాలు పెంచాలని, ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని నినాదాలతో కలెక్టరేట్ ధర్నాచౌక్ దద్దరిల్లింది. ఉక్కుపోతను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ధర్నాలో కూర్చుని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రమాసుష్మ అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడారు. హక్కులు ఎవరి బిక్ష కాదని, పోరాడి సాధించుకోవాలని అన్నారు. అంగన్‌వాడీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఐసిడిఎస్‌కు నిధులు కుదిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నివేదిక ప్రకారం అంగన్‌వాడీలకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అన్నారు. అయితే కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని విమర్శించారు చాలీ చాలని వేతనాలు ఇస్తూ, ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయట్లేదన్నారు. మహిళల సంక్షేమం తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పగా చెబుతున్న ప్రభుత్వానికి అంగన్వాడీలు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీల సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ విజరు ప్రతాప్‌రెడ్డి అంగన్‌వాడీలను చులకన చేసేలా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణిని సహించబోమని అన్నారు. ముద్దముట్టని విధంగా వంట చేస్తున్న అక్షయ పాత్రను ఎందుకు బాగా వంట చేయట్లేదో ప్రశ్నించకుండా వినయంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గుర్రాలతో తొక్కించిన ప్రభుత్వాలను సైతం ఇంటికి పంపిన చరిత్ర అంగన్‌వాడీలకు ఉందని గుర్తు చేశారు.
యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు నేతాజి మాట్లాడుతూ చట్టబద్దంగా, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచటం ప్రభుత్వ బాధ్యతన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి సిఐటియు పూర్తి అండగా ఉంటుందన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి డి.దీప్తి మనోజ మాట్లాడుతూ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, ప్రీ స్కూల్‌ను బలోపేతం చేయాలని, అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లలకూ అమ్మఒడి, యూనిఫాం ఇవ్వాలని, లబ్దిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన రి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్, నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ వంటి అన్ని రకాల ధరలూ ఆకాశాన్ని అంటాయన్నా అంగన్‌వాడీలకు వేతనాలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయన్నారు. రోజువారీ కూలీకి కూడా రూ.500లకుపైగా వస్తుందని, అంగన్‌వాడీలకు అందులో సగం కూడా రావట్లేదని అన్నారు. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ సమాజంలో గురుతర బాధ్యత నిర్వహిస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ చిన్నచూపు తగదన్నారు. అంగన్‌వాడీలకు ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, సమస్యల పరిష్కారానికి అవసరం అయితే ప్రత్యక్ష ఆందోళనలూ తమ పార్టీ చేపడుతుందని చెప్పారు. అనంతరం యూనియన్ నాయకులు సుకన్య, రమాదేవి, సరళ, ఎవిఎన్.కుమారి, టి.రాధ మాట్లాడారు. ధర్నాకు ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె.మస్తాన్‌వలి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.కళాధర్, అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ఎపిటిఎఫ్ నాయకులు నరసింహారావు తదితరులు సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు, కె.శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎస్‌కె.హుస్సేన్‌వలి, దుర్గారావు, భాగ్యరాజు, మస్తాన్‌వలి, గాంధీ రామ్మోహనరావు పాల్గొన్నారు.










