ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఇంకా మెరుగుపడాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో ఉన్న 25, 26, 27వ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పెడుతున్న పౌష్టికాహాంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడారు. పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని తెలిపారు. కేంద్రంలో ఉన్న పౌష్టికాహారం గుడ్లు, చిక్కీ, పాలు, బియ్యం, తదితర వాటిని తనిఖీ చేసి గర్భిణీలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. పిల్లలతో అక్షరాలు దిద్దించి, రైమ్స్ చెప్పించారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు చిన్నారుల శరీర బరువును స్వయంగా పరిశీలించారు. చిన్నారుల బరువు తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించి దానికనుగుణంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న పిల్లల బరువు, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అధికారులు నిరంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ, సిడిపిఒ సఫరున్నీసా బేగం పాల్గొన్నారు.
రాఘవేంద్రుని దర్శించుకున్న మంత్రి ఉషాశ్రీ చరణ్
మంత్రాలయం : మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని మంత్రి ఉషాశ్రీ చరణ్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆమెకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి.నరసింహమూర్తి, పిఆర్‌ఒ కార్యాలయ సిబ్బంది బిందు మాధవాచార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. తహశీల్దార్ చంద్రశేఖర్, సిఐ శ్రీనివాసులు, విఆర్‌ఒ భీమనగౌడు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన సీతారామిరెడ్డి
రాఘవేంద్రస్వామి దర్శనార్థమై మంత్రాలయం వచ్చిన మంత్రి ఉషాశ్రీ చరణ్‌ను వైసిపి నాయకులు వై.సీతారామిరెడ్డి కలిశారు. స్థానిక శ్రీమఠం అతిథిగృహంలో ఉన్న ఆమెను కలుసుకుని కుశల ప్రశ్నలు వేసి శాలువాతో సన్మానించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఉషాశ్రీ చరణ్










