Jan 11,2023 23:37

సిబ్బందికి సూచనలు చేస్తున్న ఐసిడిఎస్‌ పీడీ సూర్యలక్ష్మి

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రంగా లేకపోతే కఠిన చర్యలు తప్పువని ఐసిడిఎస్‌ అల్లూరి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మి హెచ్చరించారు. బుధవారం ఆమె రాజవొమ్మంగి 2, 4, విద్యానగర్‌ అంగన్వాడీ కేంద్రాలను, ఐసిడిఎస్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కార్యాలయాల నిర్వహణ, ఫీడింగ్‌ తదితర వాటిని పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ప్రీ స్కూల్‌లో అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో1423 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 1791 మెయిన్‌ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో 3 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులు 57వేల మంది, 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్‌ పిల్లలు 4,861 వేల మంది, గర్భిణులు 51 వేల మంది, బాలింతలు 11,058 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు 132 ఉండగా, 1628 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 218 కేంద్రాలకు ఫ్రీ రెంట్‌ చెల్లిస్తున్నామన్నారు. వివిధ స్కీమ్‌ల ద్వారా 436 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా, 59 పూర్తయినట్లు వెల్లడించారు. నాడు నేడు కింద 136 మంజూరు కాగా వీటిలో 106 బేస్‌మెంట్‌ లెవల్‌లోనూ, మిగిలినవి వివిధ దశల్లోనూ ఉన్నాయని చెప్పారు. అనంతరం స్థానిక పిహెచ్‌సిని సందర్శించి గర్భిణులకు పౌష్టికాహారం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఐసిడిస్‌ సీడీపీఓ పి.మణెమ్మ, సూపర్వైజర్‌ అరుణ ఉన్నారు.