Jan 25,2023 23:40

పెదబయలులో ఆందోళన చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-పెదబయలు:అంగనవాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించి, ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగనవాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ పిలుపుతో స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అంగాన వాడిలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని, పనుల పేరుతో వేధింపులు గురి చేస్తున్నాయని విమర్శించారు.వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వేతనంలో సగం పింఛను, సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయో పరిమితి తొలగించాలని, రాజకీయ జోక్యం విడనాడాలని, జనాభా ప్రాపదికన మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 1ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా సీఐటీయూ జిల్లా నాయకుడు బోండా సన్నిబాబు, ఉపాధ్యక్షుడు బోండా గంగాధరం, కార్యదర్శి కె.శరబన్న, శాంతి, భాగ్య, అంగనవాడిలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-విఆర్‌ పురం
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని రేకపల్లి ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన అంగన్వాడీలు నిరసన తెలిపారు. 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపర్వైజర్‌ నాగలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు నాగమణి, ఉపాధ్యక్షులు రంగమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కేంద్రాల్లో పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. గ్రాడ్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5లక్షలు ఇవ్వాలని, పింఛను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనక లక్ష్మి, పండు, అంగన్వాడీలు పాల్గొన్నారు
అడ్డతీగల : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి బి నిర్మల, యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు జి బేబీ రాణి, కె.అమ్మాణ, ఎం చంద్రకళ, జి లక్ష్మీ, కే బుల్లెమ్మ పాల్గొన్నారు.
కూనవరం : మండలంలోని సీడీపీఓ కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. అనంతరం సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కొమరం పెంటయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లు గా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మడెం అన్నపూర్ణ, సూర్య కుమారి, సోదే అర్జమ్మ, సైకం కవిత, ఆదిలక్ష్మి, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.