Sep 29,2023 21:59

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

అంగన్‌వాడీల హామీలు అమలు చేయాలి
ప్రజాశక్తి-మర్రిపాడు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఆనాడు చేసిన పాదయాత్రలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ ఇస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అన్వర్‌ బాషా డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని మూడు సెక్టార్ల అంగన్‌వాడీలతో సమావేశం నిర్వహించిన సమావేశానికి మండల సిఐటియు కార్యదర్శి బత్తల రత్తయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరానికి 25న విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు అంగన్‌వాడీలను పోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో విచక్షణ రహితంగా నిర్బంధానికి గురిచేసిందని దుయ్యబట్టారు. వారిపై లాఠీఛార్జి చేసి, అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే హామీలను నిలబెట్టుకోలేక అంగన్‌వాడీలను మోసం చేశాడని దుయ్యబట్టారు. అంగన్‌వాడీలతో పెట్టుకుని చంద్రబాబు నాయుడు 10ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నాడని, అదే విధంగా జగన్‌మోహన్‌ రెడ్డికి కూడా జరుగుతుందన్నారు. వెంటనే అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. అనంతరం మూడు అంగన్‌వాడీ సెక్టార్లకు సంబంధించి నాయకులను ఎన్నుకున్నారు. మర్రిపాడు సెక్టార్‌ నాయకులుగా లక్ష్మి, ఆదిలక్ష్మి, డిసిపల్లి సెక్టార్‌ నాయకులుగా వసుంధర, అరుణ, బ్రాహ్మణపల్లి సెక్టార్‌ నాయకులుగా సులోచన, జయసుధలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు నాగమణి, మర్రిపాడు మండల అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు లక్ష్మి, మూడు సెక్టార్ల అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.