ప్రజాశక్తి - చిప్పగిరి
మూడేళ్లు దాటిన పిల్లలందరికీ అంగన్వాడీ పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన విద్య ప్రారంభమవుతుందని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రసూన తెలిపారు. గురువారం ఏరూరు అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్‌వైజర్ ప్రసూన, ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనభాగీదారి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ ప్రసూన మాట్లాడారు. బాల్య దశలో మొదటి మూడేళ్లు ఇంటికే పరిమితమైన పిల్లలు ఆ తర్వాత బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ వయస్సులో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నచ్చే రీతిలో ఆట, పాటలు, కథల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యనందించడం వల్ల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పిల్లలు సత్ప్రవర్తనతో కూడిన విద్యనభ్యసించాలంటే ప్రతి తల్లిదండ్రులూ చక్కగా తీర్చిదిద్ది అంగన్వాడీ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఐదేళ్లు దాటిన తర్వాత అంగన్వాడీ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. మహిళా సంరక్షకులు, సుమలత, అంగన్వాడీ టీచర్లు పార్వతి, లక్ష్మీ, సుభాని, ఆయాలు పాల్గొన్నారు.
అంగన్వాడీ సర్టిఫికెట్ ఇస్తున్న సూపర్‌వైజర్ ప్రసూన, సర్పంచి వెంకటలక్ష్మి










