రాయచోటి : ప్రభుత్వ చర్యలతో అంగన్వాడీలు నానా అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలంటే చిన్నారులకు విద్య నేర్పించే అమ్మ వడి లాంటిది. ఇక్కడ పిల్లలకు మొదటగా ఆటల పాటలలో చదువు చెప్పిస్తారు. అంగన్వాడీ టీచర్లు వారిని మెప్పించి రప్పించే విధంగా విద్యా బోధన కొనసాగుతుంది. పైగా చిన్నారులతోపాటు గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం, గుడ్లు, వైద్యపరీక్షలు చేస్తుంటారు. అన్నమయ్య జిల్లాలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1877, మినీ అంగన్వాడీ కేంద్రాలు 398 ఉన్నాయి. వీటిలో మెయిన్ 929, మినీ 86 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలినవి మెయిన్ 639, మినీ 183, మెయిన్ ఉచిత అంగన్వాడీ కేంద్రాలు 309, ఉచిత అంగన్వాడీ కేంద్రాలు 129 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,275 భవనాలున్నాయి. అలాంటి కేంద్రాల్లో పనిచేసే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అనేక రకాల పనులు అప్పగించడం వల్ల చిన్నారుల చదువు పక్కదారి పడుతోంది. దీనికి తోడూ గ్రామ, మండల, పట్టణ స్థాయిలోనూ ఈ కేంద్రాలపై సంబంధితాధికారుల పెత్తనం ఎక్కువ కావడం, వారిని బెదిరించడం, చెప్పినట్లు వెనకపోతే పనిలో నుంచి తీసేస్తామంటూ హుకుంలు జారీ చేయడం వంటివి కూడా పరిపాటిగా మారింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు చక్కటి విద్యా బోధన అందించి వారికి పాఠశాలకు వెళ్లేసరికి ప్రాథమిక విద్యను అందించేలా తర్ఫిదునిస్తారు. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను బిఎల్‌ఒలుగా పని చేయాలంటూ చేయాలంటూ వారికి అదనపు పని భారం అప్పగించడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు జనన, మరణ, గర్భిణుల నమోదు, వారి ఎత్తు, బరువు, పోషకాహారం, పలు రకాల పనులు కూడా ఈ కేంద్రాల ద్వారానే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారుల తనిఖీలు ఎక్కువ కావడం కేంద్రాల్లో అన్ని రికార్డులు సక్రమంగా చూసుకుంటూ మరో వైపు చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం అంగన్వాడీ కార్యకర్తలకు తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు జీతం బెత్తెడు పని బారుగా మారిందని వాపోతున్నారు. జిల్లాలోని చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. చాలా వరకు వసతులు సక్రమంగా లేని అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. చివరకు అద్దె కూడా కార్యకర్తలే చెల్లించే పరిస్థితి దాపురించింది. జిల్లా మొత్తం మీద అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా ఉంది. అంగన్వాడీలకు వేతనాలు సక్రమంగా అందకపోవడం, వంట నిర్వహణకు బిల్లులు అందకపోవడం, అప్పులు చేసి మరీ కేంద్రాలను నడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కచ్చితంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. చిన్న భవనాలకు ఇలాంటి పరిస్థితులన్నీ ఉండడం చాలా అరుదు. చాలాచోట్ల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే శిధిలావస్థలో ఉన్న భవనాలలో నడుపుతున్నారు. అక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో భయం భయంగా చిన్నారులు విద్యాబోధన సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు- నేడు కింద కొన్ని గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలను భవనాలను నిర్మిస్తున్నారు. అవీ చాలా చోట్ల సకాలంలో బిల్లులు అండ కపోవడంతో నత్తనడకన భవన నిర్మాణాలు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా సొంత అంగన్వాడీ భవన నిర్మాణాలను కేంద్రాలను ఏర్పాటు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
సొంత భవనాలను ఏర్పాటు చేయాలి
అన్నమయ్య జిల్లాలో అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. కొన్ని నాడు - నేడు కింద నిర్మాణం చేపట్టినా పనులు నత్త నడకన సాగుతున్నాయి. మిగిలిన ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటిగాఉంది. కొన్ని కేంద్రాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి.
-పి.రాజేశ్వరి,అంగనవాడీ జిల్లా కార్యదర్శి, అన్నమయ్య జిల్లా