ప్రజాశక్తి - అమలాపురం
అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అమలాపురంలో కలెక్టరేట్ వద్ద సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వ రావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, జిల్లా కార్యదర్శి మురుగేశ్వర రావు సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలు న్యాయమైన డిమాండ్స్‌ను నెరవేర్చాలన్నారు. అంగన ్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ, ఇతర సౌకర్యాలను కల్పించాల న్నారు. ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, పని భారాలు తగ్గించాలన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కేంద్రాల అద్దెలు చెల్లించాలన్నారు. నాణ్యమైన సరుకులను పక్కా తూనికలతో ప్రతినెలా 5వ తేదీకి ముందే సెంటర్‌కు చేర్చాలన్నారు. ఈ సమస్యలు పరిష్క రించకుండా, ఉద్యమానికి దిగిన నాయకులు, అంగన్‌వాడీలను నిర్బంధాలకు గురిచేయడం అన్యాయమన్నారు. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కారం చేయాలని కోరుతూ మూడు నెలలుగా అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. దీంతో చలో విజయవాడకు పిలుపునిచ్చారన్నారు. దీనికి హాజరుకాకుండా అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జి.దైవకృప, ధనలక్ష్మి, మరియమ్మ తదతరులు పాల్గొన్నారు.










