
ప్రజాశక్తి-రేపల్లె: అంగన్‌వాడీ వర్కర్స్‌పై తీవ్ర నిర్భంధం, అక్రమ అరెస్టులని ఖండిస్తూ రేపల్లె బస్‌స్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ మహిళా కార్యకర్తలను, రాష్ట్ర వ్యాప్తంగా వేలమందిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించ టాన్ని నిరసిస్తూ జరిగిన రాస్తారోకోను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, అలానే ముఖ్య మంత్రి జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తామన్నా హామీనీ అమలు చేయాలని లక్షమంది అంగన్‌వాడీలు విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయటానికి సిద్ధపడ్డారన్నారు. అయితే చేతకాని ప్రభుత్వం ఆదివారం నుంచి మహిళల ఇళ్లకు పోలీసులను పంపి నోటీసులు ఇచ్చి బెదిరించడం దుర్మార్గమని పేర్కొ న్నారు. చాలాచోట్ల పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. విజయవాడ చేరుకున్న వేల మంది అంగన్‌వాడీ వర్కర్లను అరెస్టు చేసి విజయవాడలోని పోలీస్ స్టేషన్లలో నిర్భంధించటం సిగ్గుచేటని విమర్శించారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి అంగన్‌వాడీ వర్కర్స్, మహిళల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. పొలీసుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకునే దుస్థితికి రాష్ట్రం దిగజారిపోయిందని విమర్శించారు.
వేటపాలెం: చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అరెస్టుల పరంపర కొనసాగింది. వేటపాలెం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్‌వాడీలను సోమవారం తెల్లవారుజామునే పోలీసులు ఇళ్లకెళ్లి అరెస్టులు చేశారు. కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి రైళ్లలో, బస్సుల్లో విజయవాడ చేరుకున్నారు. పోలీసులు రైల్వే స్టేషన్ల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో అంగన్‌వాడీ నాయకురాళ్లు బ్యూలా, బుల్లెమ్మాయి ఉన్నారు.
చీరాల: అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పాడని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం సోమవారం విజయవాడలో చేపట్టిన మహాధర్నాను అడ్డుకునేందుకు అంగనవాడీ కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేదన్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ మరియు వివిధ రకాల యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యూటీని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎన్ బాబురావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడి అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింతగా ఉధృతం చేస్తామన్నారు.