అంగన్వాడీల అణచివేత అప్రజాస్వామికం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకై రోడ్డెక్కిన అంగన్వాడీలను ఉక్కుపాదంతో అణచివేయడం అప్రజాస్వామికమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య అన్నారు. అంగన్వాడీల అరెస్టులు, నిర్భంధాలను వ్యతిరేకిస్తూ మంగళవారం సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. పుల్లయ్య మాట్లాడుతూ నిరసన తెలిపే స్వేచ్ఛను జగన్ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీలను అరెస్టు చేసే క్రమంలో మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులు జులుం ప్రదర్శించడం హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వారికి ఇచ్చిన హామీలపై స్పందించని జగన్ అంగన్వాడీల పట్ల కర్కసంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఒక చేత్తో కేంద్రం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో స్వాగతించిన జగన్ ప్రభుత్వం మరో చేత్తో అంగన్వాడీ మహిళలపై ఉక్కుపాదం మోపి తమ దమనకాండను బయట పెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గంధం మణి, పెనగడం గురవయ్య, కుమార్, గురునాధం, ఈశ్వరయ్య, రాజా, ప్రసాద్, నాగరాజమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు టౌన్‌లో... అంగన్‌వాడీల నిర్బంధాన్ని నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, ఎస్.సురేష్, పామంజి మణి, అడపాల ప్రసాద్, ధారా కోటేశ్వరరావు, బి.చంద్రయ్య ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
అంగన్‌వాడీల నిర్బంధంపై సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన










