Jun 16,2023 00:39

నర్సీపట్నంలో ఆందోళన చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-సబ్బవరం:అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పేర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షరాలు వివి.రమణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, పింఛను, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే జులై 10, 11 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.రమణమ్మ, ఎస్‌. జగదీశ్వరి, ఎం. రమణి తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : కసింకోట ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేసి, సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎమ్‌.నాగశేషు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి, రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకురాలు డి వరలక్ష్మీ, అంగన్వాడీ యూనియన్‌ మండల అధ్యక్షులు టి తనుజా, నాయకులు శ్యామలా, లక్ష్మి, రజిని, కుమారి, జ్యోతి, చిన్నారి పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: అంగన్వాడి హెల్పర్స్‌, సిఐటియు ఆధ్వర్యాన ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అంగన్వాడీ హెల్ప్‌ హెల్పర్లు, వర్కర్లు మాట్లాడుతూ, అంగవాడీలకు గ్రాట్యూటీ, ఇతర సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. అంగన్‌ వాడీ వర్కర్లకు ఉద్యోగ భద్రత, కనీసవేతనం అమలు చేయాలన్నారు. రకరకాల యాప్‌ లు తెచ్చి పనిభారం పెంచుతున్నారన్నారు. జూలై 10, 11తేదీలలో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరవదిక ఆందోళనలు చేస్తామన్నారు.