ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేయాలని రాష్ట్ర వైసీపీ నియంత పోకడలతో ర్యాలీ, సభల ను నిషేధిస్తూ జీవో నెంబర్ 1ని తీసుకువచ్చిందని, అరెస్టుల తో ఉద్యమాలను ఆపలేరని పలువురు నాయకులు అన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించా లని కోరుతూ విజయవాడలో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న అంగన్‌వాడీ వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సిఐటియు నాయకులు ఎం వసంత రావు అన్నారు. సోమవారం చలో విజయవాడ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు ప్రాంతాల నుంచి చీరాల రైల్వే స్టేషన్, బస్టాండ్‌లకు చేరుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్టులు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన అంగన్‌వాడీ వర్కర్లను సిఐటియు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి రాకముందు అంగన్‌వాడీ వర్కర్లకు అనేక హామీలను ఇచ్చి అధికారాలు చేపట్టాక వాటిని మరిచిపోయి నియంత పాలనను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా అంగన్ వాడీ వర్కర్లకు వేతనాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇంత వరకు అమలు చేయలేదని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో అంగన్‌వాడీ వర్కర్లు క్రీస్తు రాజ్యం, కృష్ణవేణి, రమాదేవి, నాగమణి, సిహెచ్ శ్రీలక్ష్మి, వై రాధ తదితరులు ఉన్నారు.
సిపిఎం నాయకులు బాబూరావు అరెస్ట్
జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని కోరుతూ చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా కార్యక్రమానికి హాజరు కానివ్వకుండా సిపిఎం నాయకులు ఎన్ బాబురావు సిపిఐ నాయకులు ఎం వెంకట్రావు టిడిపి నాయకులు జనార్ధన్‌లను సోమవారం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరటితో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వం తక్షణమే తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పొదిలి: మాట తప్పని మడమ తిప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం రమేష్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పొదిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు నేటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయమనడం, వాటి కోసం శాంతియుతంగా ధర్నాలకు పిలుపునివ్వడం నేరమా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన అంగన్‌వాడీలను అందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. 4 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రులు మార్గమధ్యంలో అరెస్టులు చేసి స్టేషన్‌కు తరలించి నిర్భంధించడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ఠ అన్నారు. జిల్లాలో మద్దిపాడు, త్రిపురాంతకం, పొన్నలూరు, సింగరాయకొండ, కురిచేడులలో వందలాది మంది అంగన్‌వాడీలను అరెస్టు చేసి ఇప్పటికీ వదలి పెట్టలేదన్నారు. అంగన్‌వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. ఈ ప్రభుత్వానికి అలాంటి గతి పట్టకముందే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ ధర్నాలో సిఐటియు పొదిలి మండలం కార్యదర్శి బండి కోటేశ్వరరావు, నాయకులు ఎం శోభారాణి, జ్యోతి, నాగమణి, ప్రజావతి, కృపారావు, నాగలక్ష్మి, ఇందిర, కెవి నరసింహం, డి సుబ్బయ్య, జి నాగులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










