ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
సమస్యలను పరిష్కరించని ప్రభుత్వంపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద 36 గంటలపాటు ధర్నాకు దిగారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది అంగన్‌వాడీలు నల్లచీరలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తానని ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. అనేకసార్లు సమస్యలపై విన్నవించినా వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని తదితర నినాదాలు చేశారు. అంగన్‌వాడీల 36 గంటల ధర్నా సందర్భంగా కాకినాడ సామర్లకోట రోడ్డు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాలను ఇతర మార్గాల వైపు మళ్లించారు. ఈ ధర్నా సందర్భంగా సిఐటియు నాయకులు అంగన్‌వాడీలకు ు భోజన, తాగునీటి వసతిని కల్పించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జి మాట్లాడారు. తెలంగాణ కంటే అదనంగా వేతనం చెల్లిస్తామని జగన్ అంగన్‌వాడీలకు హామీ ఇచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా నేటికీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో అంగన్‌వాడీ వర్కర్క్‌ఉ నెలకు రూ.13,650 చెల్లిస్తున్నారనానరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెంచిన రూ.11,500 మాత్రమే నేటికీ చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నారన్నారు. మోడీ 2018 ఎన్నికల సందర్భంగా వర్కర్‌కు రూ.1,500, ఆయాకు రూ.750, మినీ వర్కర్ రూ.1,250 పెంచుతామని ప్రకటించిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. నేటి నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్‌కు, ఆయాకు, మినీ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి అంగన్‌వాడీలందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. మోడీ, జగన్ జోడి అధికారంలోకి రాగానే ఎంపీలకు, ఎంఎల్‌ఎలకు, ఎంఎల్‌సిలకు రూ.లక్షల్లో వేతనాలు పెంచుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో కీలకంగా పనిచేస్తున్న అంగన్‌వాడీలకు మాత్రం వేతన పెంపును విస్మరించారన్నారు. 2017 నుంచి టిఎ బిల్లులు పెండింగ్‌లో పెడితే ఎలా పనిచేయాలని? ప్రశ్నించారు. ఒకవైపు నాణ్యతలేని గుడ్లు, కందిపప్పు సరఫరా చేస్తూ మరోవైపు అంగన్‌వాడీల విధులు సరిగా నిర్వహించట్లేదంటూ ఫుడ్ కమిషనర్ వేధింపులకు గురి చేయడం మానుకోవాలన్నారు. ఎక్కడా లేనివిధంగా కాకినాడలో మాత్రమే కలెక్టరేట్ వద్ద ప్రజా ఆందోళనలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అంగన్‌వాడీలను చర్చలకు పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎపి మెడికల్ రిప్స్ యూనియన్ కాకినాడ అధ్యక్షులు స్వామి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ అంగన్‌వాడీలకు మద్దతు తెలిపి మాట్లాడారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, జిల్లా ఆఫీస్ బేరర్స్ జ్యోతి, రమణమ్మ, చామంతి, ధనలక్ష్మి, అమలావతి, నాగమణి, సునీత, దాడి బేబి, సుబ్బలక్ష్మి, నీరజ, వీరవేని, భవాని, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలం లక్ష్మి, అంగన్‌వాడీలు ఈ నిరసనలో పాల్గొన్నారు.










