Jul 07,2023 23:57

వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నాగశేషు, అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి -అనకాపల్లి
ఈ నెల 10న కోర్కెల దినం సందర్భంగా అంగన్వాడీల సమస్యలపై అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అఖిలభారత కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద జరుగు 36 గంటల ధర్నాలను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగ శేషు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 48 సంవత్సరాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అనేక సేవలందిస్తున్న అంగన్వాడీలకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి నేటికీ అమలు చేయలేదని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులు గ్రాడ్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు తెలియజేసినా దానిని అమలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో అంగన్వాడీ వర్కర్లకు రూ.1500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 పెంచుతున్నామని చెప్పినా నేటికీ పెంచలేదన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, జిఒ ప్రకారం రిటైర్‌ అయిన వర్కర్‌కి రూ.50వేలు హెల్పర్‌కు రూ.20వేలు పింఛన్‌ ఇవ్వాలని యాప్‌ల ఒత్తిడి, రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లును అరికట్టాలని కోరారు. పై సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.