
ప్రజాశక్తి- అనకాపల్లి
అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మఒడి, ఇతర ప్రభుత్వ పథకాలకు అంగన్వాడీలను అర్హులుగా ప్రకటించాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు రూ.18వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ వర్కర్లతో సమానంగా మినీ కేంద్రాల వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని కోరారు. పై సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఈ ధర్నాలు జరుగుతున్నాయని, ఇందులో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వివి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
అచ్యుతాపురం : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి కె సోమనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం ఆయన అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు రూ.18 వేలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.