May 28,2023 23:44

మాట్లాడుతున్న సుబ్బరావమ్మ

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాడ్యూటీ చెల్లించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. అరకువేలి శారదానికేతన్‌ స్కూల్లో ఈ నెల 26న ప్రారంభమైన అంగన్‌వాడీ హెల్పర్ల రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ, 2022 ఏప్రిల్‌ 25న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాడ్యూటీ చెల్లించాలని, గ్రాడ్యూటీ చట్టం- 1972 అమలు చేయాలని, గౌరవవేతనాన్ని వేతనంగా పరిగణించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చి ఏడాది గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. సంవత్సరాల తరబడి సేవలందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ తర్వాత ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో బతుకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యూటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి మాట్లాడుతూ, అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు రమ, శ్రీదేవి, దుర్గారాణి, జిల్లా నాయకులు దురియ నాగమ్మ, పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.