Sep 26,2023 20:35

మదనపల్లి : నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

మదనపల్లె అర్బన్‌ : అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌,హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మధురవాణి, కార్యదర్శి గంగా దేవిలు మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు, తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వం హామీలిచ్చి మాట తప్పిందని విమర్శించారు. ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని తెలిపారు. విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను రాష్ట్రవ్యాపితంగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, నిర్భంధించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌లలోకి మహిళలనే విచక్షణ కూడా చూడకుండా పోలీసులు అమా నుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీలు, ఉద్యోగులు, కార్మికుల గొంతునొక్కడం పచ్చి నిరంకుశత్వం తప్ప మరొకటి కాదని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల కోర్కెలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే వైసిపి ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు సభ్యులు విజయ,సుజనా, వాణి, శైలజ పాల్గొ న్నారు. నిమ్మనపల్లె :అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ మంగళవారం అంగన్వాడీ వర్కర్ల సంఘం ఆధ్వ ర్యంలో తహశీల్దార్‌ సి.ఆర్‌మంజులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భం వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ వివిధ రకాల యాప్‌ అన్ని రద్దుచేసి ఒకే యాప్‌ ద్వారా అంగన్వాడీ పనులను చేసేలా చర్యలు తీసుకోవాన్నారు. మినీ సెంటర్‌ మెయిన్‌ సెంటర్‌లో మార్చి మినీ వర్కర్లకు ప్రమోషన్‌ ఇవ్వాలని, పదవీవిరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి, నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరిపోయేంతగా సరఫరా చేయాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గీత, రెడ్డమ్మ, ముంతాజ్‌ బేగం, అకీరునిసా, శ్యామల పాల్గొన్నారు. పెద్ధమండ్యం :అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం మండలంలోని 17 పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్‌, అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక బస్టాండ్‌ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎస్‌.స్వరూపరాణి, వసంతమ్మ, బాలసరస్వతి, పార్వతి, మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.