ప్రజాశక్తి - భీమడోలు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిని సద్వినియోగపరుచుకోవాలని గుండుగొలను గ్రామపంచాయతీ ఉపసర్పంచి ముదుండి సూర్యనారాయణ రాజు కోరారు. గుండుగొలను కేంద్రంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భీమడోలు ప్రాజెక్టు పరిధిలోని గుండుగొలను సెక్టార్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా వైస్ ఎంపిపి డి.వాసంతి, ప్రాజెక్ట్ సిడిపిఒ కెవి.విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచి మాట్లాడుతూ ఉద్యోగస్తులైన తల్లులు తాము పనిచేసే ప్రాంతాలలో పిల్లలకు తల్లిపాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఇదే క్రమంలో గర్భిణీల కోసం ప్రత్యేకించిన వైఎస్‌ఆర్ పోషణ కిట్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయాలని కోరారు. భీమడోలు ప్రాజెక్ట్ సిడిపిఒ కెవి.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2023 కార్యక్రమం ఈనెల 7వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. ఉద్యోగస్తురాలైన తల్లులు తమ పిల్లలకు తల్లిపాలను ఇవ్వడం కొనసాగించేందుకు సహకరించాలని బాధ్యులకు విజ్ఞప్తి చేశారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆరునెలల వరకూ తల్లిపాలు ఇవ్వాలని, తర్వాత తల్లిపాలుతో పాటు అనుబంధ ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల కాలానికి తక్కువ కాకుండా, ఆ తరువాత వారికి వీలైనంత కాలం వరకూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండుగొలను సెక్టార్ సూపర్‌వైజర్ ఎం.కవిత, ఎఎన్‌ఎం ఇందిరతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు బి.రాజామణి, ఎం.విజయలక్ష్మి, పద్మకుమారి, నాగమణి, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.










