Apr 20,2023 19:59

వినతిపత్రం అందజేస్తున్న మహిళలు

ప్రజాశక్తి - హాలహర్వి
ఎస్సీ కాలనీలో నిర్మించే అంగన్వాడీ కేంద్రాన్ని బీసీ కాలనీలో నిర్మించాలని మహిళలు కోరారు. గురువారం హాలహర్విలో తహశీల్దార్‌కు, సిపిడిఒకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఎస్సీ కాలనీలో నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారని తెలిపారు. నిర్ణయించిన ప్రదేశంలో పక్కనే ఊరు బావి చాలా లోతుగా ఉందని, దీనికి ఎలాంటి కంచె కూడా నిర్మించలేదని చెప్పారు. ఎస్సీ కాలనీలో ఎరుకలి వారు పందులను పోషిస్తున్నారని, పిల్లలకు మలేరియా, డెంగీ, విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మాలలు, వివిధ కులాల వారు అందరూ అక్కడే మలవిసర్జన చేస్తున్నారని చెప్పారు. ఇది కూడా పిల్లలకు చాలా ప్రమాదమని తెలిపారు. ఇన్ని సమస్యలు ఉన్నందున ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్మించవద్దని కోరారు. పక్కనే ఉన్న బీసీ కాలనీ 3వ వార్డులో ప్రభుత్వ స్థలం ఉందని, ఇంతకుముందే అక్కడ సర్పంచి మల్లికార్జున పునాదులు వేసి సిద్ధంగా ఉంచారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని అక్కడ నిర్మించాలని కోరారు.