Aug 30,2023 22:22

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
             చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు సమకూర్చడంలో డాంగేనగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు వజ్ర కిరణ్‌ అన్నారు. స్థానిక 28వ వార్డు రాజీవ్‌నగర్‌ అంగన్‌వాడీ కేంద్రానికి డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో స్టీల్‌ గ్లాసులు, ప్లేట్లు బుధవారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ వజ్ర కిరణ్‌ మాట్లాడుతూ సంఘ కార్యదర్శి పఠాన్‌ బాజీ భార్య గౌస్య పుట్టినరోజు సందర్భంగా సేవాభావంతో అంగన్‌వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు అందించడం అభింనందనీయమన్నారు. చిన్నపిల్లలు చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. సంఘ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం సంఘ ఆధ్వర్యంలో డాక్టర్‌ వజ్ర కిరణ్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాంగేనగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా, గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకరరావు, అధ్యక్ష కార్యదర్శులు కె.లక్ష్మణరావు, పఠన్‌ బాజీ, అంగన్‌వాడీ కేంద్రం సూపర్‌వైజర్‌ లక్ష్మి, టీచర్‌ జాన్సీరాణి చిన్నారులు పాల్గొన్నారు.