*అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబీరాణి
*గ్రాట్యుటీ అమలు చేయాలి
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ
*ముగిసిన జిల్లా మహాసభలు
*నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి - పలాస : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కు బడ్జెట్ కేటాయింపులు పెంచి మరింత బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబీరాణి డిమాండ్ చేశారు. కాశీబుగ్గలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 8వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. తొలుత సిఐటియు పతాకాన్ని యూనియన్ జిల్లా పూర్వ అధ్యక్షులు కె.సుజాత ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనాలు కన్నా అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. నూతన విద్యా విధానం ఐసిడిఎస్ లక్ష్యాన్ని నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుందని విమర్శించారు. మణిపూర్‌లో సభ్య సమాజం తలదించుకునేలా మహిళలను నగంగా ఊరేగించిన ఘటన సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ప్రశ్నించారు. తల్లీబిడ్డల సంక్షేమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలందిస్తున్నారని కొనియాడారు. ఐసిడిఎస్ ప్రారంభం తర్వాత మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాయని, కేంద్ర బడ్జెట్‌లో ఐసిడిఎస్‌కు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. అంగన్వాడీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, మినీ అంగన్వాడీలకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని తదితర తీర్మానాలను మహాసభలో ఆమోదించారు. మహాసభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి, యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.సుధ, నాయకులు కె.కల్యాణి, ఆదిలక్ష్మి, పి.లతాదేవి, ఎన్.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా సిహెచ్.అమ్మన్నాయుడు, అధ్యక్షులుగా కె.కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా డి.సుదర్శనం, కోశాధికారిగా ఎన్.హైమావతి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.నాగమణి, కె.సుజాత, ఆదిలక్ష్మి, బి.శాంతామణి, హైమావతి, అప్పలనరసమ్మ, కార్యదర్శులుగా పి.లతాదేవి, జె.కాంచన, సిహెచ్.మౌళి, వాగ్దేవి, కె.మాధవి, కె.సింహాచలంను ఎన్నుకున్నారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలి
మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని, మహిళలను నగంగా ఊరేగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా పలాసలో లక్కీ షాపింగ్ మాల్ కూడలి వద్ద అంగన్వాడీలు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ మహిళలపై జరిగిన అమానవీయ ఘటన దేశంలోని 140 కోట్ల ప్రజానీకానికి అవమానమన్నారు. మణిపూర్‌లో పరిణామాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఖండించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










