అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలి
కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం
ప్రజాశక్తి -రంపచోడవరం
అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, చిన్నపిల్లలకు ప్రతిరోజూ పౌష్టికాహారం సకాలంలో అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు చెందిన ఐసిడిఎస్ సిడిపిఒ, ఎంపిడిఒలు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, గ్రామ సచివాలయాల మహిళా పోలీసులతో ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరేతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని గర్భిణులు, చిన్నపిల్లలకు రక్తహీనత లేకుండా మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు పరివేక్షించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం తీసుకుంటున్న గర్భిణుల బరువు, బిపి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పిల్లలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతే వారి ఇళ్లకు వెళ్లి పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహార వస్తువులను అందజేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరే విధంగా సిడిపిఓలు, తహశీల్దార్లతో కలిసి పనిచేయాలన్నారు. సిడిపిఓలు మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల తల్లుల ఫోన్ నెంబర్లు తీసుకొని, పిల్లలు అంగన్వాడీకి రాకపోతే వారితో పిల్లలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కో అంగన్వాడీ సూపర్వైజర్ నెలకు 20 అంగన్వాడీ కేంద్రాలను తప్పకుండా పరిశీలించాలన్నారు. గ్రామ సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో 15 రోజులకు ఒకసారి ఎంపీడీవోలు రివ్యూ మీటింగు పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు బాపన్న దొర, ఎంవిఆర్ కుమార్ బాబు, వీర కిషోర్, చిన్న బాబు, రత్న కుమారి, సిడిపివోలు సంధ్యారాణి, ప్రసన్న, దీప్తి, లక్ష్మీ పాల్గొన్నారు.










