ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఒ జి.ఉష, ఎసిడిపిఒ ఎ.జ్యోతిల ఆధ్వర్యంలో బుధవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 17 అంగన్‌వాడీ కేంద్రాలలో గుడ్లను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని రామారావుపేట, వరహాలయ్య పేటలతోపాటు పలు మండలా ల్లోని అంగన్‌వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్లతో కలిసి గుడ్లు సైజు, వాటి స్థితి, బరువు, నాణ్యతలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుడ్లు సరఫరా చేసే ముందు మూడు దఫాలు తనిఖీలు నిర్వహించి బరువు చూసి నాణ్యత గల గుడ్లనే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని గుడ్లు సరఫరా చేసే పౌల్ట్రీ యాజమాన్యాలకు ఆదేశించా మన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు తీసుకునే ముందు అంగన్‌వాడీ వర్కర్లు గుడ్డు నాణ్యత, బరువు ధ్రువీకరించుకోవాలని, గుడ్లు సరఫరా నుంచి లబ్ధిదారునికి చేరే వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గుడ్లు త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున దీనిని దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ వర్కర్లు ఈ గుడ్లను లబ్ధిదారులకు త్వరగా అందజేయాలని ఆదేశించామన్నారు. గుడ్లు సరఫరాలో నాణ్యత పరంగా ఎటువంటి తేడాలు గుర్తించినా వెంటనే అధికారులకు తెలియజేయాలని అంగన్‌వాడీలను ఆదేశించామన్నారు. తమ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో, పెద్దాపురం అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లకు సంబంధించి ఎటువంటి తేడాలు కనిపించలేదన్నారు. ఈ తనిఖీల్లో అంగన్‌వాడీ సూపర్వైజర్లు పి.బూసమ్మ,ఎస్ అమ్మాజీ, ఎన్ ఉమాదేవిలు పాల్గొన్నారు.
పెద్దాపురంలో గుడ్లను పరిశీలిస్తున్న సిడిపిఒ ఉష, ఐసిడిఎస్ అధికారులు










