Nov 24,2022 21:33

ప్రజాశక్తి - ఉంగుటూరు
        అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ నిర్వహణపై కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని ఐసిడిఎస్‌ పీడీ పద్మావతి అన్నారు. గురువారం ఆమె మండలంలోని తల్లాపురం, కైకరం, అక్కుపల్లిగోకవరంలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా సెంటర్లలో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ్‌, పోషణ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేసిన చిన్నారుల హాజరు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిపి-1, పిపి-2, ప్రీ స్కూల్‌ యాక్టివిటీస్‌పై కార్యకర్తలు మరింత దృష్టిసారించాలని ఆదేశించారు. గర్భిణుల, బాలింతల, చిన్నారుల సంక్షేమాన్ని సమీక్షించారు. పిల్లల ఎత్తుకు తగ్గ బరువులను, పౌష్టికాహారం స్టాకులను పరిశీలించారు. తల్లాపురంలో ఎత్తుకు తగ్గ బరువు లేనివారు ఇద్దరు, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు నలుగురు ఉన్నట్లు గుర్తించారు. అక్కుపల్లి గోకవరంలో నాడు - నేడు పథకంలో రూ.35 లక్షలతో చేపట్టిన అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణాన్ని పీడీ పరిశీలించారు. చేబ్రోలు, ఉంగుటూరు సెక్టార్ల పర్యవేక్షకులు రూప, భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.