Aug 23,2023 22:49

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

       పుట్టపర్తి అర్బన్‌ : అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగవ్వాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు సూచించారు. బుధవారం నాడు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఐసిడిఎస్‌ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీకుమారి, సిడిపిఒలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పిల్లల పెరుగుదల, బరువు తక్కువగా ఉండే పిల్లల కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 12 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు 2824 అంగన్వాడి కేంద్రాల పరిధిలో 0 నుంచి 5 ఏళ్ల పిల్లలు 3993 మంది ఉన్నట్లు గణాంక వివరాలు ఉన్నాయన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలన్నారు. వీటిపై తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. మొదట 15 రోజుల్లో భాగంగా పోషక ఆహారాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగాలన్నారు. ప్రతి మాసం చివరి వారంలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ముందస్తు ప్రణాళికాబద్ధకంగా చర్యలు చేపట్టాలని ఐసిడిఎస్‌ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. పిల్లల పెరుగుదల, బరువు వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. హిందూపురం, ఓడిసి, పెనుగొండ, బత్తలపల్లి సిడిపిఒలు సమావేశానికి గైర్హాజరు కావడం పట్ల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో ప్రగతి నివేదికతో పాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మంచి పోషక ఆహారం అందించాలని ఆదేశించారు. ప్రతినెలా ఐసిడిఎస్‌ పురోగతిపై సమీక్షిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.