
ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీ వర్కర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు కోరారు. ఈ మేరకు పీడీ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. వర్కర్ పోస్టులు ఖాళీ అయిన స్థానాల్లో అర్హులైన హెల్పర్స్ దరఖాస్తు చేసుకున్నప్పుడు వారికి ప్రమోషన్ ఇవ్వాలని, కానీ ఈ ప్రక్రియ నెలల తరబడి ఆలస్యం కావడంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తోందని అన్నారు. దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. హెల్పర్స్ దరఖాస్తులు ఆమోదించాలని కోరారు. జిల్లా కార్యాలయ పర్యవేక్షణ అధికారి మూర్తి మాట్లాడుతూ తమ వద్దకు వచ్చిన దరఖాస్తులన్నీ వారం రోజుల్లో నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ, ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.