అంగన్వాడి టీచర్లకు జీతాలు పెంచాలి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
అంగన్వాడి టీచర్లకు 17 వేలు జీతం ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మధ్యాహ్న భోజన కార్మికులకు 7 వేలు, అంగన్వాడీ వర్కర్లకు 10 వేలు, అంగన్వాడీ టీచర్లకు 17 వేల రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో దూరదష్టితో ఆలోచించి పెన్షన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకొని వచ్చిందని, కానీ నేడు ఆ హక్కుగా వచ్చిన పెన్షన్ విధానంలో మార్పులు తీసుకువచ్చి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేయడం సరికాదన్నారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నేడు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, పండించిన పంటలు చేతికి రాక కుటుంబాలతో సహా సమీప పట్టణాలకు వలసలు వెళ్లి దినసరి కూలీ బతుకులు చేసుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. కరువు మండలాలను గుర్తించి ఆయా మండలాల్లోని రైతులకు కరువు భతిని ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ ఫండింగ్ విషయంలో చాప కింద నీరుల నిధులను తెప్పించుకుంటుందని, ఎస్బిఐ కు వచ్చిన 14 వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, భాస్కర్, నాగరాజ్, పటేల్, సమూరి భాష, సావిత్రమ్మ, తేజోవతి తదితరులు పాల్గొన్నారు.










