
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కళ్యాణి
ప్రజాశక్తి - పాలకోడేరు
అంగన్‌వాడీలపై నిర్బంధ కాండ సరికాదని, సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి, సిఐటియు నాయకులు శ్రీను అన్నారు. ఈ నెల 25న అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్టులకు, నిర్బంధానికి వ్యతిరేకంగా విస్సాకోడేరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీసం తమ సమస్యలను వినే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం దారుణమన్నారు. మహిళలని చూడకుండా ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా నిర్బంధం విధించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సమస్యలపై స్పందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా రూ.వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, దుర్గ, విజయలక్ష్మి, సీతారత్నం, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.