36 గంటల మహాధర్నాలో రాత్రంతా కలెక్టరేట్ వద్ద నిద్ర
స్పందించని ప్రభుత్వం, అధికారులు
ఆగ్రహంతో కలెక్టరేట్ దిగ్బంధనం
పోలీస్ వలయం, బారికేడ్లు తోసుకుంటూ ముందుకు
అంగన్‌వాడీల నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్ ప్రాంగణం
దిగొచ్చిన అధికారులు
ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని హామీ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/ ఏలూరు అర్బన్
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 36 గంటలు ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీల ఆగ్రహం రెండోరోజు మంగళవారం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం, అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో అంగన్‌వాడీలంతా కలెక్టరేట్ ముట్టడికి దిగారు. వేలాదిమంది అంగన్‌వాడీల సమూహం పోలీస్ వలయం, బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్ ప్రధాన గేటువద్ద బైఠాయించింది. సమస్యలపై అంగన్‌వాడీలు చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరల్లింది. అధికారులు దిగొచ్చి వినతిపత్రం స్వీకరించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో అంగన్‌వాడీలు ధర్నా విరమించారు.
అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా ఏలూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది అంగన్‌వాడీలు తరలివచ్చారు. గత 36 గంటలుగా కలెక్టరేట్ వద్ద బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ వద్ద నిద్రించి వర్షంలో తడుస్తూనే తమ నిరసన కొనసాగించారు. అయినప్పటికీ అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్‌వాడీల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ రోడ్డులో ఏర్పాటు చేసిన పోలీసు వలయాన్ని ఛేదించుకుని, బారికేడ్లను తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు. వేలాదిమంది అంగన్‌వాడీలు అక్కడకు చేరుకుని సమస్యలపై నినదించడంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా దద్దరిల్లింది. జిల్లా అధికారులు వచ్చి తమ సమస్యలపై స్పందించే వరకూ కదిలేదిలేదని భీష్మించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాడ్యుటీ ఇవ్వాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెద్దపెట్టున నినదించారు. అంగన్వాడీల ఆందోళనకు స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ మూర్తి అంగన్‌వాడీల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. అంగన్ వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు
మహాధర్నాలో భాగంగా రెండో రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అంగన్‌వాడీల ఆందోళనకు పూర్తిమద్దతు పలుకుతూ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అంగన్‌వాడీలు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళన చేస్తున్న జగన్ ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషమన్నారు. ప్రభుత్వంతోపాటు జిల్లా అధికారులు కనీసం అంగన్‌వాడీలను పలకరించి వాళ్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా నాలుగేళ్ల కాలంలో అంగన్‌వాడీల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. నాలుగేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచలేదన్నారు. శాసనమండలిలో పిడిఎఫ్ పక్షాన అనేకసార్లు అంగన్‌వాడీల సమస్యలు ప్రస్తావించామని, అయినా ప్రభుత్వం వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టే చిరుద్యోగులపై జగన్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ తెలుస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ స్పందించి అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
ఐసిడిఎస్ నిర్వీర్యానికి మోడీ కుట్ర
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసే కుట్రలో భాగంగా ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.భారతి మాట్లాడుతూ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. అంగన్‌వాడీలంతా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.హైమావతి, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ గోవింద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.నరసింహ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కె.విజయలక్ష్మి, టి.మాణిక్యం, పిఎల్‌ఎస్.కుమారి, విమల, మీన, రాజకుమారి, తులసీ, సరోజని, బిజెఎన్.కుమారి, రాజమణి, పుష్ప, లత, సిఐటియు జిల్లా నాయకులు బి.సోమయ్య, జి.రాజు, వివిధ సంఘాల నాయకులు ప్రసాద్, నారపల్లి రమణారావు, ఎస్.రాంబాబు, ఎం.నాగమణి, వి.సాయిబాబు, గోపి, బి.జగన్నాథం, రైతుసంఘం నాయకులు కె.శ్రీనివాస్ నాయకత్వం వహించారు.










