టిడిపి, వైసిపి పరస్పరం రాళ్ల దాడి
చంద్రబాబు కాన్వారుపైనా...
ఆరుగురు టిడిపి కార్యకర్తలకు గాయాలు
20 వాహనాలు ధ్వంసం
పెద్దిరెడ్డి రౌడీయిజాన్ని పాతాళానికి తొక్కేస్తా : చంద్రబాబు
ప్రజాశక్తి-కురబలకోట/మదనపల్లె అర్బన్ : అధికారమే అండగా అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైసిపి శ్రేణులు రెచ్చిపోయారు. సాగు నీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ములకలచెరువు మండలంలోని సోంపాళ్యం వద్ద నాయని చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి ములకచేరువు మీదుగా కాండ్లమడుగు క్రాస్ వద్ద నున్న హంద్రీనీవా కెనాల్‌ను పరిశీలించారు. అనంతరం అంగళ్లుకు చేరుకొని మదనపల్లె బైపాస్ మీదుగా రోడ్డు షో నిర్వహించారు. మదనపల్లె బైపాస్ రోడ్డులో టిడిపి నాయకులు గజమాలతో సత్కరించారు. కురబలకోట మండలం అంగళ్లు శుక్రవారం రణరంగంగా మారింది. రెచ్చిపోయిన వైసిపి కార్యకర్తలు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్‌ఎస్‌జి కమాండోలు బాబుకు రక్షణగా నిలబడ్డారు. వైసిపి మూకల దాడిలో ఆరుగురు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. టిడిపి బ్యానర్లను వెసిపి శ్రేణులు చించి వేశాయి. రెండు గ్రూపులు బాహాబాహికి దిగాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. చంద్రబాబు అంగళ్ల నుండి వెళ్లిపోయిన తరువాత మళ్ళీ వైసిపి మూకలు మరోసారి దాడులకు తెగబడ్డారు. 20 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా గురువారం నుండి ఉమ్మడి జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసిపి నాయకులు ప్రకటించారు. పుంగనూరులో అడుగు పెట్టకూడదన్నారు. పోలీసులు చంద్రబాబు రోడ్డు షోకు అనుమతి నిరాకరించారు. గురువారం నుండి రెండు గ్రూపులు మొకలిల్లాయి. అడ్డుకోవడానికి వైసిపి, బాబు పర్యటనను విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులు పట్టుపట్టాయి. వైసిపి శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా తంబల్లపల్లిలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
పెద్దిరెడ్డి రౌడీయిజాన్ని పాతాళానికి తొక్కేస్తా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరుల అరాచకాలు తారాస్థాయికి చేరాయని చంద్రబాబు ఆరోపించారు. మీ రౌడీయిజాన్ని, అరాచకాలను పాతాళం లోకి తొక్కేస్తానని హెచ్చరించారు. ఇలాంటి నీచ రాజకీయాలు రాష్ట్రంలో ఎప్పుడూ లేవన్నారు. పెద్దిరెడ్డి పతనం ఈ రోజు అంగళ్ళు నుండి ప్రారంభమైందన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. దీంతో మరో సారి రాళ్ళ దాడి జరిగింది. రక్షణ సిబ్బంది బాబుకు రక్షణగా నిలపడ్డారు. అంగళ్లలో ఉద్రిక్తత మంత్రి రామచంద్రారెడ్డి, పోలీసుల పనిగా చంద్రబాబు వర్ణించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలియుగ రావణాసురుడిగా అభివర్ణించారు. ఇలాంటి వారిని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పుంగనూరుకు వెళ్తున్నా ఆ పుడింగి సంగతి తేలుస్తానని సవాల్ చేశారు. బాంబులకే భయపడలేదని నాలుగు రాళ్లు వేస్తే భయపడతానా అంటూ ఎదురు దాడి చేశారు. పులివెందుల వెళ్లాను, చిత్తూరులో పర్యటించడానికి అడ్డంకి ఎందుకు అని ప్రశ్నించారు. ఈ జిల్లాలోనే పుట్టాను ఇలాంటి రాజకీయాలు చాలా చూశానని పేర్కొన్నారు. టిడిపి ఎవరిమీద దౌర్జన్యం చేయదని టిడిపి మీద దౌర్జన్యం చేస్తే వదిలేది లేదన్నారు. డిఎస్‌పి అసమర్థత కారణంగానే దౌర్జన్యం జరిగిందని, యూనిఫారం విప్పేయలని సూచించారు. వైసిపి నాయకులు పోలీసుల అండదండలతో దౌర్జన్యాలు చేస్తున్నారని పోలీసులు లేకుండా ధైర్యం ఉంటే ముందుకు రావాలని సవాల్ చేశారు. అంగళ్లు, పుంగనూరు సంఘటన తన జీవితంలో మర్చిపోనన్నారు. ఇది ఒక బ్లాక్ డే గా వర్ణించారు. ఇంతకు ఇంతా తీర్చుకుంటానని పేర్కొన్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటానన్నారు. గాయపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










