Sep 28,2023 20:56

మాట్లాడుతున్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

కడప అర్బన్‌ : ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు పుంగనూరు పర్యటనలో జరిగిన అల్లర్ల సంఘటనలో అన్నమయ్య జిల్లా అంగళ్లు, పుంగనూరు టిడిపి చెందిన 72 మంది కార్యకర్తలు గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారికి టిడిపి జిల్లా నాయకులు కడప సెంట్రల్‌ జైలు ప్రధాన గేటు వద్ద స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులతో జైలుకు వెళ్లామని, బాధపడే కన్నా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న లక్ష్యంగా వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత పోరాటం చేయాలన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమానికి పాటుపడిన, టిడిపి అధినేత చంద్రబాబును నిరాధారమైన అవినీతి ఆరోపణలతో అరెస్టు చేసి జైలుకు పంపిన జగన్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించే వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబం విశ్రమించకూడదని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని అన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్ని కుట్రలతో అరెస్టు చేసి జైలుకు పంపిన నిర్దోషులుగా బయటకి రావడం జరుగుతుందన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. న్యాయమే గెలుస్తుంది అన్నది జగమెరిగిన సత్యం అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌ , గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ వైసిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గానికి నిదర్శనం, అక్రమ కేసులతో టిడిపి నాయకులను జైళ్లకు పంపడమే అన్నారు. కేసులతో భయపెట్టి తిరిగి గెలవాలన్నదే వైసిపి నేతల లక్ష్యమన్నారు. ఇప్పటికే వైఇసపి ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజల్లో అభాసుపాలైందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టడం కడతారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడే పరిస్థితి లేదని వారు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.