Jul 24,2023 00:25
చంద్రశేఖర్‌ ఆజాద్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారికి సింహ స్వప్నంగా నిలిచిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ ధైర్య సాహసాలు నేటి తరం అలవర్చుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి మదన్మోహన్‌ చెట్టి అన్నారు. ఆదివారం ఆజాద్‌ 117వ జయంతి సందర్భంగా పోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కార్యాలయం వద్ద ఆజాద్‌ విగ్రహానికి చెట్టి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమంలో లాలా లజపతిరారు మరణానికి కారకులైన ఆంగ్లేయ అధికారులను హతమార్చి ఆజాద్‌ భారతీయుల సత్తా చాటారు. సాయుధ పోరాట బాట పట్టిన తొలి విప్లవకారుడు అజాద్‌ అన్నారు. భగత్‌సింగ్‌ వంటి త్యాగధనులకు ఆజాద్‌ మార్గదర్శకత్వం వహించారన్నారు. ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, న్యాయవాదులు జడ్‌ బాషా, భాస్కరగౌడ్‌ పాల్గొన్నారు.