Jun 02,2023 23:40
దుగ్గిరాల విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆర్డీవో రవీందర్‌

ప్రజాశక్తి-బాపట్ల: చీరాల-పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయ కత్వం వహించి జాతీయ స్థాయిలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఆంధ్రుల సత్తా చాటి తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని బాపట్ల ఆర్డిఓ గంధం రవీందర్‌ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల 135వ జయంతి సందర్భంగా బాపట్ల తహశీల్దారు కార్యాలయ ఆవరణలో గోపాలకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వేలాదిమంది ప్రజలను 11 నెలల పాటు ఒకే తాటిపై నడిపించి చీరాల పేరాల ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి ఆంధ్రుడిగా దుగ్గిరాల జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారన్నారు. రామదండును ఏర్పాటు చేసి ఎంతోమందిని స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేశారు. ఆయన చూపిన తెగువ, సాహసం అనితర సాధ్యమని దుగ్గిరాల ఉద్యమ స్ఫూర్తిని రవీందర్‌ కొనియాడారు. దుగ్గిరాల బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమస్తాగా పనిచేయడం గర్వకారణమన్నారు. ఆయన నడయాడిన ప్రాంతానికి ఆంధ్రరత్న ప్రాంగణం నామకరణం చేసిన ఫారం ఫర్‌ బెటర్‌ కార్యదర్శి పిసి సాయిబాబును ఆర్డీవో అభినందించారు. కార్యక్రమంలో పోరం కార్యదర్శి డాక్టర్‌ పిసి సాయిబాబు, తహశీల్దారు సిహెచ్‌ సుధా రాణి, యూవీ రామారావు, బండికళ్ల బాబూరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.