ఆంధ్రప్రదేశ్ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మన్నూరు భాస్కరయ్
కళ్యాణకట్ట తరహాలో శ్రీనివాస ధోబి ఘాట్‌ను ఏర్పాటుచేసి..
పర్మనెంట్ ఉద్యోగాలివ్వాలి
ప్రజాశక్తి- తిరుపతి : తిరుమలలోని కళ్యాణకట్ట తరహాలో శ్రీనివాస ధోబీఘాట్‌ను టీటీడీనే ఏర్పాటుచేసి రజకులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మన్నూరు భాస్కరయ్య డిమాండ్ చేశారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం (ఎంబి.భవన్)లో ఆదివారం ఉదయం 11గంటలకు ఏపీ రజక వత్తిదారుల సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రజక సదస్సును నిర్వహించారు. ఈసదస్సుకు నిమ్మనపల్లి మునిరత్నం అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ... టీటీడీలో రజకుల పట్ల తీవ్రవివక్ష, నిర్లక్ష్యం చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు శుభ్రం చేసే పనిని రజకులకు కాకుండా బడా కాంట్రాక్టర్లకు అప్పగించి చోద్యం చూస్తున్నారని టిటిడి తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి పాలకమండలిలో పలు దఫాలు రజకులకు అనుకూలంగా తీర్మానాలు చేసినా, నేటికీ అమలకు నోచుకోలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా టిటిడినే శ్రీనివాస మోడ్రన్ ధోబీఘాట్‌ను ఏర్పాటు చేసి పర్మనెంట్ ప్రాతిపదికన రజకులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రజక వత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఎలాంటి ఆంక్షలు లేకుండా జగనన్న చేదోడు పథకాన్ని రజకులు అందరికీ వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు గ్రామ బహిష్కరణలను అరికట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో నెంబర్ 343 ప్రకారం వత్తి చెరువులపై రజకులకే హక్కులు కల్పించి, వత్తి నిర్వహణకు తోడ్పడాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్లుగీత, చేనేత, మత్స్యకారుల తరహాలో 50 సంవత్సరాలు నిండిన రజకులకు నెలకు రూ.3000లు చొప్పున పెన్షన్ ఇవ్వాలని, రజక వత్తిదారులు ఇస్త్రీ పనిచేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ మాదిరి 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇవ్వాలని కోరారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులకు కనీసవేతన చట్టం అమలు చేయాలని, జిల్లాలో ఇల్లులేని ప్రతికుటుంబానికి స్థలం మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ మండలి మాజీ చైర్మన్ దాసరి జనార్ధన్ మాట్లాడుతూ రజక వత్తిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోబీ ఘాట్లు వాటి నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సదస్సులో రజక కార్పొరేషన్‌కు వెయ్యికోట్ల వార్షిక బడ్జెట్ను కేటాయించాలని, అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇస్ట్రీదారులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రిలో దోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ... పలు తీర్మానాలను ఏకగ్రీవంగా సదస్సు ఆమోదించింది. ఈ సదస్సులో రజక వత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జోరేపల్లి దిలీప్ కుమార్, సీనియర్ నేతలు గండికోట ఈశ్వరయ్య, మారేడు పల్లె రాధాకష్ణ, కవిలి నాగరాజు, తాలూరు పద్మనాభం, జయంతి , వెంకటరమణ, అమ్ములు, శివకుమార్, సునీల్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక..
తిరుపతి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. గౌరవ సలహాదారులుగా గండికోట ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షునిగా నిమ్నపల్లి మునిరత్నం, ప్రధాన కార్యదర్శిగా జోరేపల్లి దిలీప్ కుమార్ కోశాధికారిగా మారేడు పల్లె రాధాకష్ణ, ఉపాధ్యక్షులుగా తాళ్లూరు పద్మనాభం, కగిలి నాగరాజు, రమణయ్య, కలత్తుర్ రమణయ్య, జయంతి, సహాయ కార్యదర్శిగా గండికోట నాగరాజు, కామేపల్లి శివకుమార్, సి.వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులుగా అమ్ములు, గురవయ్య, సునీల్ కుమార్, గండికోట గోపి వెంకటముని, బాలాజీ, పుట్టయ్య శంకరయ్య , సుధాకర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










