Sep 12,2021 06:38

  • టంగుటూరి ప్రకాశం 150వ జయంతి సంవత్సరం

     ఇది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం నూట యాభయ్యవ జయంతి సంవత్సరం. 1872 ఆగష్టు 23న పుట్టిన ప్రకాశంది ఆధునిక ఆంధ్ర రాజకీయ నాయకుల తొలి తరంలో ప్రథమ స్థానం. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా ప్రజలకే అంకితమైన నిస్వార్థ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయారు. 2021 ఆగష్టులో మొదలైన ప్రకాశం 150వ జయంతి ఉత్సవాలు ఈ ఏడాది మొత్తం జరుగుతాయి. ఆయన ఔన్నత్యం గురించి, ఆదర్శాల గురించి స్మరించుకోవడం...అదే సమయంలో ఆయన జీవితం, రాజకీయ గమనం రాష్ట్ర చరిత్రపై ఎలాంటి ప్రభావం ప్రసరించింది కూడా తెలుసుకోవడం అవసరం.
      ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భాగంగా వున్న వినోదరాయనిపాలెంలో (అప్పటి గుంటూరు జిల్లా) పుట్టిన ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య నెల్లూరు జిల్లాకు వలసవెళ్లి వెంకటగిరి సంస్థానంలో ఉద్యోగిగా చేరారు. ఎనిమిదవ ఏట తండ్రిని కోల్పోయిన ప్రకాశం నాయుడు పేటలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. పరాధీనత ఇష్టంలేని ఆయన తల్లి సుబ్బమ్మ ఒంగోలు మునిసిఫ్‌ కోర్టు ముందు పూటకూళ్ల భోజనం పెడుతూ కుమారుణ్ని చదివించింది. అక్కడ లెక్కల మాష్టారు ఇమ్మనేని హనుమంతరావు ప్రకాశంను విశేషంగా ప్రోత్సహించారు. ఆయన రాజమండ్రికి వెళ్లినపుడు ప్రకాశం కూడా వెళ్లిపోయారు. నటనపై ఆసక్తి వున్న గురువు ప్రేరణతో ప్రకాశం నాటకాలు వేసేవారు. ఆ కాలంలో నాటక కంపెనీల వివాదాలు పరిష్కరించడంలో దూకుడుగా వుంటూ రౌడీగా పేరు తెచ్చుకుని...మెట్రిక్‌్‌ ఒకసారి తప్పారు. ఎఫ్‌.ఎ పూర్తిచేసి లా లో చేరబోతేే వయసు చాలలేదు. రెండేళ్లు ఆగి 1893 నుంచి మద్రాసు లా కాలేజీలో చదివి ప్రాక్టీసు పెట్టారు. రాజమండ్రి మునిసిపల్‌ చైర్మన్‌ ఆయ్యారు. ఆపైన లండన్‌ వెళ్లి బారిస్టరు పూర్తి చేసి 1907 నుంచి మద్రాసులో న్యాయవాద వృత్తి మొదలెట్టారు. మద్రాసు లాయర్లతో నెగ్గుకు రావడం కష్టమని చెప్పినా పట్టుదలగా అక్కడే వుండి అమోఘంగా రాణించారు. భార్య హనుమాయమ్మ ఎంతో సహకరించేవారు.
 

                                                     త్యాగం, సాహసానికి మారుపేరు
       ఆనాటి బారిస్టర్లు చాలామంది లాగే ప్రకాశం కూడా స్వాతంత్య్ర పోరాటం వైపు ఆకర్షితులైనారు. వాస్తవానికి ఆ రోజులలో ఆయన రెండు చేతులా సంపాదించేవారనీ లెక్క కూడా వుండేది కాదని అంటారు. లా టైమ్స్‌ అనే పత్రిక నడిపారు. ఇన్ని అవకాశాలు వున్న ప్రకాశం 1921లో గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపుతో వృత్తిని వదిలి ఉద్యమంలో దూకారు. అదే ఏడాది స్వరాజ్య పత్రిక స్థాపించారు. కోటంరాజు రామారావు, ఖాషా సుబ్బారావు వంటి హేమాహేమీలైన సంపాదకులు అక్కడే తయారైనారు. 1921లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడైనారు. 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం విరమించడంతో అసంతృప్తి చెంది మోతీలాల్‌ నెహ్రూ వంటి వారు స్థాపించిన స్వరాజ్య పార్టీలో చేరారు. జాతీయ శాసనసభకు రెండుసార్లు ఎన్నికై అందరినీ ఆకర్షించారు. 1928 ఫిబ్రవరి 26న సైమన్‌ కమిషన్‌ పర్యటన సందర్భంలో మద్రాసులో కాల్పులు జరిపి ఒకరిని బలిగొన్న బ్రిటిష్‌ పోలీసులకు గుండెలు చూపించి ఆంధ్రకేసరి అయ్యారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పిలుపుతో కేంద్ర శాసనసభకు రాజీనామా చేసి ఉద్యమంలో దూకి అరెస్టయ్యారు. ప్రకాశం సాహసం, త్యాగం, ప్రతిభ గొప్పగా చెప్పుకునేవారు. వీటితో పాటు అరాచకం, వ్యక్తిగత ధోరణులు సాగిస్తారనే విమర్శ వున్నా ప్రజలు ఆయనను గౌరవించారు. గాంధీజీ ఆదేశాలకు కూడా లోబడకుండా తన స్వంత వైఖరితో సాగేవారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టుగా మారినా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న పుచ్చలపల్లి సుందరయ్య ప్రకాశంనే బలపర్చడంతో కాంగ్రెస్‌వాదులు ఆయననూ అభిమానించడం మొదలెట్టారు.
      మద్రాసు రాష్ట్రంలో 1937లో రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం రెవెన్యూ మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా పొటీ చేయగలిగినా ఐక్యత కోసం సర్దుకున్నారు. అప్పుడే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకూ జరిగిన రైతాంగ పాదయాత్ర ముందుకు తెచ్చిన అంశాలపై జమీందారీ వ్యతిరేక నివేదిక తయారు చేశారు. ఆ బిల్లు ఆమోదం పొందేలోగా 1939లో కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆయననూ అరెస్టు చేసి 1945 వరకూ జైలులో పెట్టారు. 1945లో ఆయన విడుదలైన సందర్భంలో ప్రజలు సత్కరించి 50 వేల రూపాయలు బహూకరించారు. ఈ మొత్తం ఆయన దుర్వినియోగం చేశారని వ్యతిరేకులైన కళా వెంకట్రావు వంటి వారు ఫిర్యాదు చేస్తే గాంధీజీ ఆరోపణలతో లేఖ రాశారు. తనకు స్వార్థంలేదనీ ఆ సొమ్ము తన నిరాడంబర జీవితానికి పోగా మిగిలింది ప్రజల కోసమే ఖర్చు చేస్తానని ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టు జవాబిచ్చారు.
 

                                                       ప్రకాశం ఆర్డినెన్సు, నిర్బంధం

    1946 నాటికి ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమం కూడా బాగా ఊపందుకుంటున్నది. కార్మిక కర్షక ఉద్యమాలు యువజన సంఘాలు విస్తరిస్తున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం నాయకత్వంలో మంత్రివర్గం అధికారం స్వీకరించింది. రాజగోపాలాచారిని గాంధీజీ బలపర్చినా ప్రకాశం పంతులును కామరాజ్‌ నాడార్‌ బలపర్చారు. కాని బలంగా వున్న ప్రత్యర్థులు స్పీకర్‌ ఎన్నికలోనే ఆయన నిలబెట్టిన తెన్నేటి విశ్వనాథంను ఓడించారు. దేశ స్వాతంత్య్రానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అప్పటికి కాంగ్రెస్‌ నాయకులు విడుదలైనారు గాని కమ్యూనిస్టులు విడుదల కాలేదు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ఆంధ్ర ప్రాంతం అండగా నిలిచింది. 1947 ప్రారంభంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రకాశం మంత్రి వర్గం ఒక ఆర్డినెన్సు జారీ చేసింది. ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రైతుల కార్మికుల పోరాటాల ప్రజ్వలనను అణచివేయడం, కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయడం ఆ ఆర్డినెన్స్‌ లక్ష్యం. ఈ ఆర్డినెన్స్‌ రావడానికి ప్రకాశం కారకుడా అనే చర్చ జరిగింది. దాన్ని ప్రకాశంకు తెలియకుండా అధికారులు రూపొందించారనీ, ఆయన దీన్ని ఉపసంహరించుకుని ప్రజాస్వామికంగా పనిచేసే అవకాశం కలిగించాలని కమ్యూనిస్టులు కోరారు. అయితే ఆర్డినెన్స్‌ ఉపసంహరింపబడకపోగా ఉద్యమంపై తీవ్ర నిర్బంధం కొనసాగింది. ప్రకాశం వ్యక్తిగతంగానూ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం సాగించారు. అంతర్గత కలహాల వల్ల 1947 మార్చిలో ప్రకాశం మంత్రివర్గం పడిపోయి ఒమండూరు రామస్వామి రెడ్డియార్‌ ప్రభుత్వం ఏర్పడింది. రెండు వర్గాల కాంగ్రెస్‌ నేతలు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మంత్రులకు పర్యటనలలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. కాని కమ్యూనిస్టులపై నిర్బంధం, కాల్చివేతలు మాత్రం కొనసాగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కమ్యూనిస్టులు ఉత్సవాలు జరిపారు కూడా. అయినా నిర్బంధం ఆగిందిలేదు. 1948 జనవరి 30 గాంధీజీ హత్య తర్వాత ఈ నిర్బంధం ఇంకా పెరిగింది. తెలంగాణలో నాలుగు వేల మంది, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని వందల మంది కమ్యూనిస్టు యోధులు, కార్యకర్తలు ప్రాణాలర్పించారు. 1951లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ, 52 ఎన్నికల నాటికి గాని ప్రశాంత పరిస్థితులు నెలకొనలేదు.
 

                                              కమ్యూనిస్టుల ఘన విజయం, ప్రకాశంతో కూటమి

    తొలి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. కమ్యూనిస్టులపై హింసాకాండ, భీతావహం వల్ల తాము నల్లేరు మీద బండిలాగా గెలిచిపోతామని కాంగ్రెస్‌ వారు ఆశపడ్డారు. కాని కమ్యూనిస్టుల మీద ప్రజలు గొప్ప గౌరవాభిమానాలు చూపించారు. తెలంగాణ ప్రాంతంలోనూ కమ్యూనిస్టులే పిడిఎఫ్‌ పేర ఘన విజయాలు సాధించారు. జైళ్ల నుంచి విడుదలైన కమ్యూనిస్టు నేతలు పోలీసుల పైశాచికాలను కళ్లకు కట్టినట్టు వర్ణించి చెప్పేవారు. ప్రజలకూ ప్రత్యక్షంగా తెలుసు. కోస్తా జిల్లాలలో పూర్తిగానూ రాయలసీమలో పరిమితంగా కమ్యూనిస్టులే విజయాలు సాధించారు. ప్రకాశం కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ పేరిట పోటీ చేయగా రంగా గౌతు లచ్చన్న కృషీకార్‌ లోక్‌పార్టీ, పి.వి.జి.రాజు సోషలిస్టు పార్టీ కూడా కొన్ని స్థానాలు గెలిచాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడైన నీలం సంజీవరెడ్డి అనంతపురంలో తన బావమరిది కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు (తర్వాత సంజీవరెడ్డి కాళహస్తిలో తన అనుచరుడితో రాజీనామా చేయించి ఉప ఎన్నికతో మళ్లీ వచ్చారు). రేపల్లెలో మోటూరు హనుమంతరావు మంత్రి కల్లూరి చంద్రమౌళిని ఓడించారు. ఇదే అంతటా జరిగింది. కళా వెంకటరావు, బెజవాడ గోపాలరెడ్డి, వేముల కూర్మయ్య అంతా ఓడిపోయారు. మద్రాసులో పోటీ చేసిన ప్రకాశం కూడా ఓటమి పాలైనారు (మరో చోట గెలిచారు). రంగా ఓడిపోయారు. ఆంధ్ర ప్రాంతంలోని 140 స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు 43 వస్తే కమ్యూనిస్టులకు 44 వచ్చాయి. మద్రాసు రాష్ట్రం లోని 375 స్థానాల్లో మొత్తం మీద 152 మాత్రమే తెచ్చుకున్న కాంగ్రెస్‌కు మెజరిటీ రాలేదు. ప్రకాశం నాయకత్వంలోని కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీతో కలసి కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన కూటమికి 164 సీట్లు వున్నాయి. ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిన గవర్నర్‌ శ్రీప్రకాశ్‌ను కోరారు. అయితే గవర్నర్‌ అడ్డదోవలో రాజాజీని శాసనమండలికి నామినేట్‌ చేసి ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రంగా అటే నిలబడ్డారు. రాజాజీ రంగా కృషీకార్‌ లోక్‌పార్టీ నుంచి ఎంఎల్‌ఎ లను ఆకర్షించే పని మొదలుపెట్టారు. అదే చరిత్రలో మొదటి ఫిరాయింపుల ఘట్టం. పేడ లోంచి పురుగుల్లా ఎంఎల్‌ఎ లు వెళ్లిపోతున్నారని ప్రకాశం ఈసడించారు. కాని సోషలిస్టుల జోక్యంతో 1952 డిసెంబర్‌లో ఆయన ఈ కూటమి నుంచి నిష్క్రమించారు. అదే నెలలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రగులుతున్న రాష్ట్ర కాంక్ష ఈ దీక్షతో మరీ విజృంభించింది.
 

                                                 ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి కావాలని...

     పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి తర్వాత 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 140 మందితో ఏర్పడిన తొలి శాసనసభలో కమ్యూనిస్టులకు, వారి మద్దతుతో గెలిచిన స్వతంత్రులు, ఇతర పార్టీలవారు, మద్దతునిచ్చిన వారితో కలిసి 65 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌కు 40 వుంటే, 9 మంది స్వతంత్రులను ప్రలోభాలతో చేర్చుకుని, 13 మంది సభ్యులుగల ప్రకాశంను కూడా తనవైపు తిప్పుకుంది. 15 మందిగల గౌతు లచ్చన్న కృషీకార్‌ లోక్‌పార్టీ పరోక్షంగా బలపర్చింది. ఆంధ్ర రాష్ట్రానికి తనే తొలి ముఖ్యమంత్రి కావాలన్నది ప్రకాశం తాపత్రయం. ప్రకాశం నాయకత్వం వల్లనే ఈ ప్రభుత్వం ఆంధ్రత్వం పుణికిపుచ్చుకుందని ప్రధాని నెహ్రూ అవతరణ దినోత్సవంలో చెప్పారు. ఆ సభలో తరిమెల ప్రతిపక్ష నాయకుడుగా, మోటూరు హనుమంతరావు ఉప నాయకుడుగా వుండేవారు. వాస్తవానికి అప్పటికే ప్రకాశంకు బాగా వయసు పైబడి ఆరోగ్యం దెబ్బతిన్న స్థితిలో ఉప ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి చక్రం తిప్పేవారు. ఆయన రాజకీయం మార్చుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెసేతర ప్రభుత్వంతో కమ్యూనిస్టులు ప్రధాన శక్తిగా ఏర్పడి వుండేదన్నది చారిత్రిక సారాంశం. ప్రకాశం అంతకు ముందు తానే వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో చేరి ఈసడించిన ఫిరాయింపుదార్లతో కలసి పదవి చేపట్టారని రాజ్యసభలో సుందరయ్య తీవ్రంగా విమర్శ చేశారు. ఇంతచేసినా ప్రకాశం మంత్రివర్గం ఏడాది మాత్రమే వుంది. మద్య నిషేధం పేరిట సాగుతున్న దారుణ పరిస్థితులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తెచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 1954 నవంబరు ఆ ప్రభుత్వం పడిపోయింది.1955 లోనూ ఒంగోలు నుంచి ఆయన గెలిచారు గాని కాంగ్రెస్‌ బెజవాడ గోపాలరెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.1957 మే 20న ప్రకాశం కన్నుమూశారు. ఆయన వుండగా ప్రారంభించిన కృష్ణా బ్యారేజికి ప్రకాశం పేరే పెట్టాలని ముఖ్యమంత్రి సంజీవరెడ్డి నిర్ణయించారు. 1972లో ఆయన శత జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. రాజకీయ ఒడుదుడుకులు ఎలా వున్నా...త్యాగం, సాహసం మూర్తీభవించిన ప్రకాశం ఘన కీర్తి తెలుగువారి గుండెల్లో ప్రకాశిస్తూనే వుంటుంది.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి