Aug 23,2023 21:03

నివాళులర్పిస్తున్న మేయర్‌

నివాళులర్పిస్తున్న మేయర్‌
ఆంధ్రకేసరి జీవితం అందరికీ ఆదర్శనీయం
ప్రజాశక్తి-నెల్లూరు :ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు, త్యాగనిరతి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయనీ, సంఘసంస్కర్తగా ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని నగరపాలక సంస్థ మేయర్‌ స్రవంతి తెలియజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో కమీషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఐ.ఏ.యస్‌., తో కలిసి బుధవారం అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ప్రజా నాయకునిగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అగ్ర స్థానంలో నిలుస్తారని, అలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఆశయసాధనకు కషి చేద్దామని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టపడి చదివి ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని మేయర్‌ కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వ్యవస్తాపకునిగా రాష్ట్రంలో విద్యారంగానికి యెనలేని సేవలందించారని మేయర్‌ ప్రశంసించారు.
వివిధ రంగాలలో అయన సేవలను గుర్తించి ప్రకాశం బ్యారేజ్‌ కు ప్రకాశం పంతులు పేరును పెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఏటా ఆ మహనీయుని జయంతిని కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం అదష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కమీషనర్‌ శర్మద మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయక సైమన్‌ కమీషన్‌ కు ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా టంగుటూరి ఖ్యాతి పొందారని తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించి, ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు సేవలందించారని వివరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సేవా నిరతిని గుర్తిస్తూ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం గర్వకారణమని అదనపు కమీషనర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యస్‌ .ఈ.సంపత్‌ కుమార్‌ డిప్యూటి కమీషనర్‌ చెన్నుడు, ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ, మేనేజర్‌ ఇనాయతుల్లా, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు