
ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవుఏతోంది. పెరుగుతోన్న జనాభా, వాహనాల వినియోగానికి అనుగుణంగా రోడ్లు లేవు. ఉన్న రోడ్లలో వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణాలేదు. దీనికి తోడు ప్రత్యేకంగా ట్రాఫిక్ విభాగం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవటంలేదు. కేవలం ట్రాఫిక్ నియంత్రణకు ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కేటాయించి, నామమాత్రపు సిబ్బందితో మమ అనిపిస్తున్నారు. దీంతో పరిఫ్కారం లేని సమస్యగా ట్రాఫిక్ సమస్య తయారైంది.
సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో తెనాలి ఒకటి. దాదాపు నూరేళ్లకు పైగా చరిత్ర కలిగిన తెనాలి పురపాలక సంఘంలో 40 వార్డులున్నాయి. నలుదిశలా విస్తరిస్తున్న పట్టణంలో జనాభా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. రెండు లక్షల పైచిలుకు జనాభా కలిగిన తెనాలిలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువే. దీనికి తోడు వివిధ సంస్థలకు చెందిన రవాణా వాహనాలు కూడా అధికమే. అయితే పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్లు లేవు. అధిక శాతం వ్యాపార కూడళ్లకు పార్కింగ్ స్థలం కూడా లేదు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌లకు కూడా సెల్లార్లు లేకుండా నిర్మిస్తున్నా అధికారులు మాత్రం చోధ్యం చూస్తున్నారు. దీంతో పట్ణణంలో ఏ ప్రాంతంలో చూసినా వాహనాల పార్కింగ్ రోడ్లపైనే. ప్రధానమైన రోడ్లలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ఉంచటంతో పెద్ద పెద్ద రోడ్లు సైతం ఇరుకు సందులను తలపిస్తున్నాయి. పట్టణంలో ప్రతి నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా కొత్తవంతెన, ఎన్వీఆర్ బ్రిడ్జి సాయిబాబా గుడి, లక్ష్మీడీలక్క్ కూడలి, శివాజిచౌక్, గాంధీచౌక్, అశోక పెన్‌వర్క్స్ ప్రాంతాల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ట్రాఫిక్ జామ్ కావటం ఖాయం.
ట్రాఫిక్ విభాగం ఏర్పాటే లేదు..నియంత్రణా సిబ్బంది నామమాత్రమే
గుంటూరు తరువాత జిల్లాల్లో అతి పెద్ద పట్టణం తెనాలి. పట్టణంలో ట్రాఫిక్ తీవ్రత, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు దీర్ఘకాలికంగా చూస్తూనే ఉన్నారు. ట్రాఫక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు మాత్రం చర్యలు తీసుకోలేదు. కేవలం ట్రాఫిక్ నియంత్రణకు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కేటాయించి, మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఓ గదిని కేటాయిచి మిన్నకున్నారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు కనీసం 25 మంది సిబ్బంది ఉండాలని అధికారులే చెబుతున్నారు. అయితే సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తోడు పట్టణంలోని ఒన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల నుంచి ఇద్దరు చొప్పున కానిస్టేబుల్స్‌ను ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. వారితో పాటు హోంగార్డులు కూడా. అంతా కలిసి పది మందిలోపే సిబ్బంది ట్రాఫిక్ విధుల్లో ఉంటున్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ వారికి పెద్ద సవాలుగానే ఉంది.
ట్రాఫిక్ స్టేషన్ ఎస్టాబ్లిష్‌మెంటే లేదు..పైగా సిబ్బంది కొరత
బి.శివరామయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ, తెనాలి.
పట్టణంలో రజకచెరువు, ఎన్‌విఆర్ బ్రిడ్జి, అశోక పెన్‌వర్క్స్, శివాజి చౌక్, గాంధీ చౌక్ ట్రాఫిక్ పాయింట్లుగా ఉన్నాయి. వాస్తవానికి తెనాలిలో ట్రాఫిక్ విభాగం ఏర్పాటే లేదు. కేవలం ట్రాఫక్ క్రమబద్దీకరణకు నాతో పాటు మొత్తంగా పది మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి కనీసం 25 మంది సిబ్బంది ఉండాలి. ఇటీవల నేను బాద్యతలు స్వీకరించిన తరువాత మార్కెట్ వంతెనపై వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆటోల పార్కింగ్ క్రమబద్ధీకరించాం. ఆదివారం ఇష్టానుసారంగా రోడ్లపై నిర్వహించే ఫిష్ మార్కెట్‌ను బస్టాండ్ నుంచి నందివెలుగు రోడ్డు మార్జిన్‌కు తరలించాం. ఇలా చిన్నిచిన్న మార్పులకు ప్రయత్నిస్తున్నాం. అవకాశం ఉన్నమేర ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నాం.