
* జిల్లా వ్యాప్తంగా నేడు ప్రారంభం
* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన క్రిష్ణదాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి (వై ఎపి నీడ్స్ జగన్) అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నరసన్నపేట ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. నగరంలోని స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి మండలంలోనూ ఒక్కో గ్రామ సచివాలయంలో తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు. గతేడాది కాలంగా గడప గడపకూ ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లి తామేమీ చేశామో, ఏం చేయగలమో ప్రజలకు చెప్పామన్నారు. అందరి కంటే ముందు మేమేమీ చేశామో, ఏం చేయగలమో చెప్పేశాము... ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జగన్‌తోనే ఇవన్నీ సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రతి గ్రామంలోనూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో బోర్డులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అనర్హులు ఎవరైనా ఉంటే వెంటనే గుర్తించి వారికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. దేశంలో జిడిపి అభివృద్ధి రేటు కలిగిన రాష్ట్రాల్లో ఎపికి మొదటి స్థానం దక్కిందన్నారు. తలసరి ఆదాయంలో టాప్ 10 రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 4,93,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. టిడిపి ఐదేళ్లలో 34,108 మందికే ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. పరిశ్రమల వృద్ధిరేటులో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు నిర్మించామని వెల్లడించారు. కొత్తగా నాలుగు ఓడరేవులు, 10 షిప్పింగ్ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులిచ్చామని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీగా వైసిపి మాట నిలబెట్టుకుందన్నారు. సమావేశంలో కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మెన్ అంధవరపు సూరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, పార్టీ నాయకులు చింతాడ రవికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.